టెలికం సంస్థలు నష్టాలతో విలవిల్లాడుతున్నా.. రిలయన్స్ జియో మాత్రం రికార్డులు నెలకొల్పుతున్నది. 45.4 శాతం పురోగతి సాధించి రూ.990 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మరోవైపు జియోకు సారథ్యం వహిస్తున్న రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,05,214 కోట్లకు చేరుకుంది. ఒక కార్పొరేట్ సంస్థ అత్యధిక ఎం క్యాప్ గల సంస్థగా నిలిచింది.
ఇతర టెలికం సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నా రిలయన్స్ జియో మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నది. జూలై-సెప్టెంబర్ మధ్య సంస్థ రూ.990 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.681 కోట్లతో పోలిస్తే 45.4% అధికం. వినియోగదారులు పెరుగడం రిలయన్స్ కంపెనీకి కలిసి వచ్చింది.
జియో ఆపరేటింగ్ రెవెన్యూ 33.7% పెరుగుదల
సమీక్షాకాలంలో కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 33.7% వృద్ధి చెంది రూ.12,354 కోట్లకు ఎగబాకింది. 35 కోట్ల మంది కస్టమర్లతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవల సంస్థగా జియో అవతరించిందని, ప్రస్తుతం కూడా ప్రతినెల కోటి మందికి పైగా వినియోగదారులు తమ నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్నారు.
కస్టమర్ నుంచి రూ.120 ఆదాయం
జియో అంటే దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ కాదని..డిజిటల్ గేట్‌వే ఆఫ్ ఇండియాగా మారిపోయిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ప్రతి ఒక్కో వినియోగదారుడి నుంచి కంపెనీకి రూ.120 ఆదాయం సమకూరుతున్నది. తొలి త్రైమాసికంలో వచ్చిన దాంతో పోలిస్తే రూ.2 తగ్గింది. సెప్టెంబర్ 30 నాటికి సంస్థకు 35.52 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
దూసుకుపోతున్న రిలయన్స్ జియో
టెలికం వినియోగదారులను ఆకట్టుకోవడంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. ఆగస్టులోనూ కంపెనీ కొత్తగా 84.45 లక్షల మంది జియో నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లను కోల్పోయాయని భారత టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్) తెలిపింది.
118.92 కోట్ల మందికి చేరిన టెలికం సబ్ స్క్రైబర్లు
జూలై చివరి నాటికి భారత్‌లో 118.92 కోట్ల టెలికం సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఆ మరుసటి నెల చివరికల్లా 119.18 కోట్ల మందికి పెరిగారు. వీరిలో వైర్‌లెస్ సబ్‌స్ర్కైబర్లు 117.10 కోట్ల మంది ఉన్నారు. మొత్తం వినియోగదారుల్లో వీటి వాటా 98 శాతం. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్ర్కైబర్లు 116.83 కోట్ల నుంచి 117.10 కోట్ల మందికి పెరిగారు. జియో నెట్‌వర్క్‌ను 84.45 లక్షల మంది ఎంచుకోగా, వొడాఫోన్ ఐడియా నుంచి 49.56 లక్షల మంది వైదొలగగా, అలాగే భారతీ ఎయిర్‌టెల్ నుంచి 5.61 లక్షల మంది ఇతర నెట్‌వర్క్‌లలోకి వెళ్లిపోయారు.
బీఎస్ఎన్ఎల్ సంస్థను వీడిన 2.36 లక్షల ఖాతాదారులు
వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను కూడా 2.36 లక్షల మంది వీడగా, ఎంటీఎన్‌ఎల్‌ను 6,701 మంది, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను 63 మంది వీడి వెళ్లిపోయారు. 2018 అక్టోబర్ నుంచి జియోతోపాటు ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వినియోగదారులు జతవగా, ఆగస్టులో మాత్రం తగ్గారు. 48.6 లక్షల మంది కస్టమర్లు తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌కు బదిలీ అయ్యారు.
2.08 కోట్లకు పరిమితమైన బీఎస్ఎన్ఎల్ వైర్ లెస్ కనెక్షన్లు
బీఎస్‌ఎన్‌ఎల్ వైర్‌లెస్ కనెక్షన్లు 1.5 లక్షలు తగ్గి 2.08 కోట్లకు పడిపోగా, అలాగే ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లు కూడా 1.41 లక్షల మంది కోల్పోయింది. ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్లలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ మాత్రం అభివృద్ధిని నమోదు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 1.87 శాతం పెరిగి 61.55 కోట్లకు చేరాయి.
రూ. 9 లక్షల కోట్లు @ రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని గడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ సాధించిన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది. శుక్రవారం అంతర్గత ట్రేడింగ్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకోవంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,05,214 కోట్లకు చేరుకున్నది. కానీ, చివరి వరకు ఈ స్థాయిలో లాభాలను నిలుపుకోలేక పోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,97,179.47 కోట్లకు పడిపోయింది.
రూ.1415.30 వద్ద 1.37%తో ముగిసిన రిలయన్స్ షేర్ లాభం
అంతర్గత ట్రేడింగ్‌లో 2.28 శాతం లాభపడి రూ.1,428 వద్దకు చేరుకున్న రిలయన్స్ షేర్ ధర చివరకు 1.37 శాతం లాభంతో రూ.1,415.30 వద్ద ముగిసింది. ఆగస్టు 2018లో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటింది. ఆ మరుసటి ఏడాదిలోనే మరో రూ. లక్ష కోట్లు పెరుగడం విశేషం. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడం, చమురు-పెట్రోకెమికల్ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇందుకు కలిసొచ్చింది. గత ఏడాదికాలంలో కంపెనీ షేర్ విలువ 23.63 శాతం లాభపడింది.
ఎం-క్యాప్‍లో రెండో స్థానంలో టీసీఎస్
మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.7,71,996.87 కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.6,72,466.30 కోట్లు, హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ.4,55,952.72 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ ఎం-క్యాప్ రూ.3,61,801.97 కోట్లు, ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.3,29,751.88 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎం- క్యాప్ రూ. 3,08,708.32 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ. 3,02,861.98 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం క్యాప్ రూ.2,82,783.39 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ ఎం- క్యాప్ రూ.2,39,947.60 కోట్లతో టాప్-10 జాబితాలో ఉన్నాయి.