5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా 5జీ గురిచే ప్రధానంగా చర్చ సాగుతున్నది. వచ్చే యుగం 5జీదేనని భావిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ వరుస కడుతాయంటున్నారు. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు గూగుల్, వన్ ప్లస్ మాత్రం తమ కొత్త మొబైల్ ఫోన్లలో 5జీ ఫీచర్ లేకుండా విపణిలోకి తీసుకురావడంతో అంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇటీవల విడుదలైన పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో మోడల్ ఫోన్లను 5జీ ఫీచర్ లేకుండా ఆవిష్కరించడంపై చర్చ సాగుతుండటంతో సదరు సంస్థలు స్పష్టతను ఇచ్చాయి. గూగుల్ 5జీ ఫీచర్‌తోనే పిక్సెల్ 4 మోడల్ ఫోన్ విడుదల చేస్తుందని అంతా భావించినా పిక్సెల్ 4 సిరీస్ మొబైల్ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు కంపెనీ చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
దీనిపై గూగుల్ ప్రొడక్ట్ డిజైన్ ఉపాధ్యక్షుడు బ్రియాన్ రకౌస్కీ ఒక ప్రకటన చేస్తూ.. ‘మేం తప్పకుండా 5జీ నెట్క్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తాం. కానీ దీనికి ఇది సరైన సమయం కాదని గూగుల్ భావిస్తోంది. విస్తరణ, నెట్ వర్క్ పరంగా ఇప్పటికీ 5జీ నెట్ వర్క్ అన్ని చోట్ల అందుబాటులో లేదు. దీంతో అతి తక్కువ మందికే 5జీ చేరువవుతోంది. దీనికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా వ్రుద్ధిలోకి రాలేదు. అంతా సిద్ధమయ్యాక మేం 5జీ ఫోన్ తీసుకువస్తాం’ అని పేర్కొన్నారు.
ముకేష్‌కు జియోతో నెల రోజుల్లో రూ.40 వేల కోట్లు
మరోవైపు చైనా మొబైల్ దిగ్గజం వన్ ప్లస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితం బ్రిటన్‌లో వన్ ప్లస్ 7 ప్రో అనే 5జీ ఫోన్ విడుదల చేసింది. కానీ తర్వాత వచ్చిన వన్ ప్లస్ 7టీ ప్రో మోడల్ ఫోన్‌లో మాత్రం 5జీ ఫీచర్ ఇవ్వలేదు.
వన్ ప్లస్ సీఈఓ పీట్ లా మాట్లాడుతూ ‘ప్రతి మోడల్ ఫోన్ లోనూ 5జీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. మేం 5జీ మోడల్ ఫోన్లు తయారు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులలో వాటి తయారీ ఎంత వరకు సబబనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం’ అని చెప్పారు.