
కొద్దిరోజుల క్రితం వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థకు ఫేస్‌బుక్ బదిలీ చేసిందన్న వార్తలు విని ప్రపంచం ఉలిక్కిపడింది. కస్టమర్ల భద్రత ముఖ్యమని చెప్పే ఫేస్‌బుక్ కూడా మోసం చేసిందని ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. ఫేస్‌బుక్ సేఫ్ కాదని నమ్మి ఎంతోమంది దానిని డియాక్టివేట్ చేసేశారు కూడా. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి గూగుల్ కూడా చేరిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నిత్యం ఎన్నో అవసరాలకు వినియోగించే జీ-మెయిల్ అకౌంట్లు కూడా... మూడో వ్యక్తి చేతుల్లోకి వెళతాయన్నది వాటి సారాంశం. యాప్స్ తయారీ, సర్వేల నిర్వహణ, వయసుల వారీగా యాడ్స్ విస్తరణ లాంటి విషయాల్లో మరింత కచ్చితత్వం కోసం థర్డ్ పార్టీ.. మెయిల్స్ లో ఉన్న కంటెంట్‌ను చదువుతారని గూగుల్ ప్రకటించింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది గూగుల్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి బర్త్‌డే, ఫోన్ నెంబర్, విద్యార్హతలు, ఉద్యోగం వంటి సమాచారమే లభిస్తుంది. కానీ జీమెయిల్ అలా కాదు.. వ్యక్తిగత సమాచారం...ఫోటోలు, వీడియోలు, నగదు లావాదేవీల వివరాలను జీమెయిల్‌లోనే చాలా మంది స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ని వివరాలు మూడో వ్యక్తి చేతుల్లోకి వెళితే జరిగే ఉపద్రవాలు ఊహకు కూడా అందవంటున్నారు నిపుణులు.