టెక్నాలజీ దిగ్గజాలపై కరోనా ‘పడగ’: ఉద్యోగుల ప్రయాణంపై ఆంక్షలు

By telugu news team  |  First Published Feb 29, 2020, 2:56 PM IST

స్విట్జర్లాండ్‌లోని గూగుల్‌ ఉద్యోగి కరోనా వైరస్ బారీన పడ్డారు. దీంతో తమ సంస్థ ఉద్యోగులకు ప్రయాణాలపై సెర్చింజన్ ఆంక్షలు విధించింది. గూగుల్‌ ఆధ్వర్యంలో జరిగే 'గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్', సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నిర్వహించ తలపెట్టిన ‘ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్‌’ రద్దు చేశారు.


ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్‌-19‌)తో గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు గడగడ వణుకుతున్నాయి. తాజాగా సెర్చింజన్ గూగుల్‌ ఉద్యోగి ఒకరు ఈ వైరస్‌ బారినపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ కార్యాలయంలో చాలా పరిమితం సమయం గడిపిన ఒక ఉద్యోగికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజారోగ్య అధికారుల సలహాలను అనుసరించి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామనీ, ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని గూగుల్ వెల్లడించింది. అయితే ఆఫీసును మూసి వేయలేదని పేర్కొంది.

Latest Videos

undefined

ఇరాన్, ఇటలీ చైనాకు ప్రయాణించే ఉద్యోగులను పరిమితం చేయడంతోపాటు జపాన్, దక్షిణ కొరియాకు ఆంక్షలను త్వరలోనే అమలు చేయనున్నామని కంపెనీ తెలిపింది. కాగా కోవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ-రిటైలర్ అమెజాన్‌ తన ఉద్యోగుల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.
 అలాగే ఏప్రిల్‌లో ఉత్తర కాలిఫోర్నియాలో జరిగాల్సిన 'గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్' శిఖరాగ్ర సమావేశాన్ని గూగుల్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిపై విచారం వ్యక్తం చేసిన గూగుల్‌, తమ అతిథుల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తప్పలేదని వెల్లడించింది. 

అటు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  కూడా మేలో  జరగాల్సిన తన ప్రధాన ఎఫ్ 8 డెవలపర్ సమావేశాన్ని నిలిపివేసింది. కరోనావైరస్ 57 దేశాలకు చేరుకోవడంతో వైరస్ వల్ల ప్రపంచ ప్రభావం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం  ప్రకటించిన  సంగతి తెలిసిందే.

కరోనావైరస్‌పై సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. కరోనా వైరస్‌కు సంబంధించిన తప్పుడు ప్రకటనలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో వీటిపై కొరడా ఝళింపించేందుకు సిద్ధమైంది. తప్పుడు సమాచారాన్నిస్తున్న ప్రకటనలపై నిషేధించినట్టు ప్రకటించింది. 

అలాగే తప్పుడు యాడ్స్ డిస్ ప్లే చేసే ఫేస్‌బుక్, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం,  ప్రకటనలు ఈ వైరస్‌పై చేస్తున్న పోరాటంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. 

click me!