మాటలతో ఉద్యోగుల్లో ప్రేరణకు స్టీవ్ జాబ్స్‌ది వండర్‌ఫుల్ లీడర్ షిప్

By rajesh yFirst Published Jul 9, 2019, 11:09 AM IST
Highlights


మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ఆపిల్ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనది అద్భుత నాయకత్వం అని, ఉద్యోగులను ప్రేరేపించడంలో ప్రవీణుడని, యాపిల్‌ను నిలబెట్టింది ఆయనేనని పేర్కొన్నారు.

వాషింగ్టన్‌: మాటల మాంత్రికుడు యాపిల్‌ మాజీ సీఈఓ, దివంగత స్టీవ్‌ జాబ్స్‌ది అద్భుత నాయకత్వం అని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. ఆయన మాటల మాంత్రికుడని, తన మాటలతో ఉద్యోగులను లక్ష్యాల సాధనకు ప్రేరేపించడంతోపాటు వారు ఎక్కువ గంటలు పనిచేసేలా ప్రోత్సహించేవాడన్నారు. 

 

స్టీవ్‌ జాబ్స్‌ అద్భుత నాయకత్వమే మూత బడాల్సిన ‘యాపిల్’ కంపెనీని ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు. యాపిల్‌ సహ వ్యవస్థాపకుడైన ఒకరైన జాబ్స్‌ ప్యాంక్రియాసిస్ క్యానర్స్ వ్యాధితో 2011లో మరణించారు. ఆయన తరువాత టిమ్‌ కుక్‌ కంపెనీ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 

 

స్టీవ్‌ జాబ్స్‌ నాయకత్వం ‘దయచేసి ఇది మీ ఇంట్లో ప్రయత్నించకండి’అనే తరహాలో ఉండేదని ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు మరిన్ని ఎక్కువ గంటలు ఉత్సాహంగా పనిచేసేలా చూసే అద్భుత చాతుర్యం స్టీవ్‌జాబ్స్‌లో అమితంగా ఉండేదన్నారు. 

 

మూసివేసే దశకు చేరుతున్న యాపిల్‌ను నిలబెట్టి, అత్యంత విలువైన సంస్థగా తీర్చిదిద్దడంలో స్టీవ్‌జాబ్స్‌ అసమాన నాయకత్వ ప్రతిభ చూపారని బిల్‌గేట్స్‌ వివరించారు. ‘స్టీవ్‌జాబ్స్‌ అద్భుత చాతుర్యం కలిగిన నిపుణుడు. ఆయన ధాటికి ప్రజలు మైమరచిపోయేవారు. అయితే నేను కూడా చిన్నపాటి మాంత్రికుడిని కావడం వల్ల, నేను మాత్రం బయట పడ్డాను’ అని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.

 

‘స్టీవ్ జాబ్స్‌ తన అద్భుతమైన మాటలతో ప్రజల్ని అబ్బుర పరిచేవాడు. స్టీవ్‌ జాబ్స్‌లా కంపెనీ ఆశయాలకు తోడ్పడే నిపుణులను ఎంచుకోవడంతోపాటు వారిని అమితంగా ప్రేరేపించగలిగే మరో వ్యక్తి నాకింకా తారసపడలేదు. కంపెనీ ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిలో అసాధారణమైన సానుకూలతను నింపగలిగారు. ఇందుకు స్టీవ్‌ జాబ్స్‌ ఏకైక ఉదాహరణ’ అని బిల్ గేట్స్ తెలిపారు.

 

‘నైపుణ్యాన్ని వెలికితీసి, మరింతగా ప్రేరణ కలిగించే స్టీవ్‌జాబ్స్‌ వంటి మరో వ్యక్తిని మళ్లీ కలవలేదు’ అని గేట్స్‌ తెలిపారు. అలాంటి వ్యవహారశైలి వల్లే, ఎనలేని సానుకూల పరిణామాలను స్టీవ్‌ ఆవిష్కరించారని ప్రశంసించారు. స్టీవ్‌జాబ్స్‌ తరువాత యాపిల్‌ సీఈఓగా టిమ్‌ కుక్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మీ నాయకత్వ శైలి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్‌గేట్స్‌ బదులిస్తూ ‘న్యాయశాఖ తీర్పులో మినహా, ఖాతాదార్లు గానీవిలేకరులు ఎవరూ కూడా నేను నిరంకుశంగా, మొరటుగా, ఆజ్ఞాపించేలా వ్యవహరిస్తానని చెప్పలేదు’ అని తెలిపారు.
 

click me!