సగటు మొబైల్ ఫోన్ వినియోగదారుడు తన ఔట్ గోయింగ్ కాల్స్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా సంస్థల కంటే తాము చౌకగా సేవలందిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అన్ లిమిటెడ్ ప్లాన్లు కొనుగోలు చేస్తే ఔట్ గోయింగ్ కాల్స్ ఉచితమని ప్రకటించాయి.
న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్ విషయంలో విధించిన పరిమితి.. సాధారణ వినియోగదారుడి అవసరాల కంటే ఐదు రెట్లు ఎక్కువగానే తాము అందిస్తున్నామని రిలయన్స్ జియో తెలిపింది. కనుక వినియోగదారుడు అదనంగా చెల్లించాల్సిన అవసరం రాబోదని పేర్కొంది.
తమ పోటీ సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్‌లతో పోల్చినప్పుడు తమ ప్లాన్లే చౌకగా ఉన్నాయని తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌లకు వర్తించే ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితిని తొలగిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించిన నేపథ్యంలో జియో ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
undefined
also read వాట్సాప్ కొత్త ఫీచర్...వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు....
ఐదు రెట్లు అధిక డేటా ఇస్తున్నామన్న జియో
ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో జియో అందిస్తున్న ‘ఆల్ ఇన్ వన్ ప్లాన్లు’ ఒక సాధారణ కస్టమర్ అవసరాలతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువే తాము అందిస్తున్నామని ఆ కంపెనీ తెలిపింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం వినియోగదారుడి సగటు వాడకం ఆధారంగా తమ ప్లాన్లు రూపొందించినట్లు పేర్కొంది.
ప్రత్యర్థి సంస్థలకంటే 25 శాతం అదనపు వసతులు
ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే తాము 25 శాతం అదనపు వసతులను వినియోగదారులకు అందిస్తున్నట్లు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో జియో తాజాగా ప్రవేశపెట్టిన ప్లాన్లలో 28 రోజులకు వెయ్యి నిమిషాలు, 84 రోజులకు 3000 నిమిషాలు అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా డిసెంబర్ 3 నుంచి ఇంతే పరిమితితో వేర్వేరు ప్లాన్లు ప్రకటించినా ఔట్‌గోయింగ్ కాల్స్‌పై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.
ఫ్రీ పెయిడ్ వినియోగదారులకు అపరిమిత ఔట్ గోయింగ్ ఇలా
మళ్లీ ఉచిత కాల్స్ వచ్చేశాయి. ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ కొత్త ప్లాన్లను సవరించాయి. అన్‌లిమిటెడ్ ప్లాన్లను కొనుగోలు చేసినవారికి అపరిమిత ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ అందుబాటులోకి వస్తాయి. ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ ఔట్‌గోయింగ్ కాల్స్ వసతి ఉంటుంది. శనివారం నుంచే ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించగా, ఎలాంటి షరతులు ఉండవని స్పష్టం చేసింది.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్ ఇలా
28 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్‌ను ఉచితంగా ఇస్తున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. 84 రోజుల ప్లాన్‌లో 3000 నిమిషాలు, 365 రోజుల ప్లాన్‌లో 12 వేల నిమిషాలను ఇస్తున్నాయి. ఈ పరిమితి దాటితే టాప్‌అప్‌లు వేసుకోవాల్సిందే.
నిమిషానికి 6 పైసల చార్జీ వర్తిస్తుందని ఈ నెల 3న ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా ఇక నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని రెండు సంస్థలు ట్వీట్ చేశాయి. ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లకు కాల్స్, డేటా చార్జీలను 50 శాతం వరకు పెంచుతున్నట్లు ఈ నెల 1న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్లు ఇవి
రూ.219, రూ.399, రూ.449 ప్లాన్లను ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఎయిర్‌టెల్ వివరాల ప్రకారం రూ.219 ప్లాన్ 28 రోజులు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కైనా), రోజుకు ఒక జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.399 ప్లాన్ గడువు 56 రోజులు. అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 1.5జీడీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.449 ప్లాన్ కాలపరిమితి కూడా 56 రోజులే. అయితే ఇందులో అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకుతోడు రోజు 2జీబీ డేటా వస్తుంది.
also read ఆపిల్ క్లిప్స్ యాప్ లో కొత్త ఫిచర్
ఇలా జియో కంటే ఎయిర్ టెల్ చౌక
ఎయిర్‌టెల్ తరహాలో వొడాఫోన్ ఐడియా రూ.219 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా, ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేతతో ఎయిర్‌టెల్ రూ.399 కొత్త ప్లాన్.. జియో రూ.399 ప్లాన్ కంటే చౌక కావడం గమనార్హం. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీం కోర్టు తీర్పుతో టెలికం పరిశ్రమపై భారం పడిన విషయం తెలిసిందే. దీన్ని అధిగమించేందుకే ఆయా సంస్థలు చార్జీలను పెంచిన సంగతీ విదితమే.
‘రివ్యూ’ తిరస్కరణకు గురైతే వొడాఫోన్ ఐడియాకే దెబ్బ
ఏజీఆర్‌పై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఎయిర్‌టెల్ కంటే వొడా ఐడియాకే దెబ్బని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడిచిన 14 ఏళ్లకు స్పెక్ట్రం వినియోగ చార్జీ, లైసెన్స్ ఫీజులు, వాటికి వడ్డీ, జరిమానాలు చెల్లించాలన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించిన సంగతి తెలిసిందే. దీంతో 1.47 లక్షల కోట్ల భారం టెలికం పరిశ్రమపై పడింది.
3 నెలల్లోగా చెల్లించాలనీ దేశించింది. ఎయిర్‌టెల్ 4.8 బిలియన్ డాలర్లు, వొడాఫోన్ ఐడియా 5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తున్నది. ఫలితంగా ఈ సంస్థలు సుప్రీంలో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు వేశాయి. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటంతో రివ్యూ పిటిషన్ కొట్టివేస్తే ఆ సంస్థకు ఇబ్బందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.