మళ్ళీ అదేసీన్ రిపీట్ చేసిన వొడాఫోన్‌ ఐడియా... నష్టాలు రూ.6,439 కోట్లకు పెరిగాయి.

By Sandra Ashok Kumar  |  First Published Feb 14, 2020, 10:15 AM IST

భారతీయ టెలికం సంస్థలు ఇప్పట్లో కోలుకునేలా సంకేతాలు కనిపించడం లేదు. ఏజీఆర్ ప్లస్ స్పెక్ట్రం బకాయిలు, వడ్డీ తదితర చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా చెల్లింపుల కోసం వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ తమ సంస్థ లాభాలను కేటాయిస్తున్నాయి. ఫలితంగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో రూ.50 వేల కోట్ల పై చిలుకు నష్టాలను చూపిన వొడాఫోన్.. మూడో త్రైమాసికంలోనూ 6,439 కోట్ల నష్టాలు వచ్చినట్లు పేర్కొంది.


ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లోనూ భారీ నష్టాలను నమోదు చేసింది.  2019-20 మూడవ త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నష్టాలు రూ .6,439 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 50,922 కోట్లని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరిగిన ఆర్థిక ఖర్చులు, ఆస్తుల విలువ క్షీణత ప్రభావం చూపినట్టు కంపెనీ తెలిపింది.

గురువారం ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్‌ ఐడియా మొత్తం ఆదాయం ఐదు శాతం తగ్గి రూ .11,381 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ. 11,983 కోట్లని ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. 

Latest Videos

also read ఇండియాలో మొబైల్‌ డాటా అత్యంత చౌకగా... జియో స్పెషల్

వొడాఫోన్ ఐడియా కంపెనీ ఆర్థిక ఖర్చులు దాదాపు 30 శాతం పెరిగి రూ.3,722 కోట్లకు చేరుకోగా, తరుగుదల 23 శాతం పెరిగి రూ.5,877 కోట్లకు చేరుకుంది .వినియోగదారుల సంఖ్య గత క్వార్టర్‌లో 31.1  కోట్లతో పోలిస్తే మూడో త్రైమాసికంలో లో 30.4 కోట్లకు తగ్గింది.

గత క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 2.3 శాతం పుంజుకుందని వొడాఫోన్ ఐడియా సీఎండీ రవీందర్ తక్కర్ పేర్కొన్నారు. 14 త్రైమాసికాల  తరువాత సగటు రోజువారీ రాబడి (ఎడిఆర్) వృద్ధి తిరిగి వచ్చిందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.

వేగవంతమైన నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్‌తో పాటు 4జీ కవరేజ్, కీలక మార్కెట్లలో సామర్థ్యం విస్తరణపై దృష్టి సారించినట్టు వొడాఫోన్ ఐడియా సీఎండీ రవీందర్ తక్కర్ చెప్పారు. ఏజీఆర్‌ ఇతర విషయాలపై ఉపశమనం కోరుతూ  ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పారు. 

గత నెల జనవరి 24 నాటికి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సి సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విలువ రూ. 53 వేల కోట్లు. అయితే, గతేడాది అక్టోబర్ 24వ తేదీ ఉత్తర్వులను సవరించడానికి పిటిషన్ వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన మూడు వారాల తరువాత వొడాఫోన్ ఐడియా ఫలితాలు వచ్చాయి.

also read  గుడ్ న్యూస్ ఐటీ రంగంలో ఈ ఏడాది రెండు లక్షల కొత్త ఉద్యోగాలు

మరోవైపు ఏజీఆర్‌ బకాయిల  చెల్లింపులపై ఉపశమనం కల్పించకపోతే  కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని వొడాఫోన్ ఐడియా అధినేత కుమార మంగళం బిర్ల హెచ్చరించిన సంగతి విదితమే.  ఏజీఆర్ చెల్లింపుల వ్యవహారమే వొడాఫోన్ - ఐడియాను నష్టాల ఊబిలోకి నెట్టింది. 

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్)లో సంస్థ ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ఓ భారతీయ సంస్థ ఈ స్థాయిలో నష్టాలను చూపిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

గత ఆర్థిక సంవత్సరం (2018-19) జూలై-సెప్టెంబర్‌లో వొడాఫోన్ ఐడియా సంస్థకు రూ.4,874 కోట్ల నష్టాలు వాటిల్లాయి. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వొడాఫోన్, ఎయిర్ టెల్ సంస్థలకు శరాఘాతమైంది. 
 

click me!