పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెవెన్యూపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇండియన్ ఐటీ కంపెనీల్లో గుబులు మొదలైంది. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం అని భారత ఐటీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకు రాకపోతే ఇబ్బందికరమేనని ఆ వర్గాల కథనం.
ముంబై: చైనాను ఠారెత్తిస్తున్న కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాంతోపాటు తాజాగా భారత ఐటీ కంపెనీలనూ భయపెడుతోంది. ప్రస్తుతానికైతే భారత ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం పెద్దగా లేదు.
185 బిలియన్ల డాలర్ల టర్నోవర్ గల భారత ఐటీ పరిశ్రమపై పడే ప్రభావం చాలా కనిష్ఠంగానే ఉంటుందని అంచనా వేస్తున్నా, వచ్చే రెండు, మూడు వారాల్లో వైరస్‌ను అదుపులోకి తీసుకు రాకపోతే మాత్రం తిప్పలు తప్పక పోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాలోని అనేక తయారీ కంపెనీలు భారత ఐటీ కంపెనీల ఖాతాదారులు కావడమే ఇందుకు కారణం.
చైనాలో సేవలందిస్తున్న అగ్రశ్రేణి ఔట్ సోర్సింగ్ సంస్థల్లో టీసీఎస్ ఒకటి. టీసీఎస్‌తోపాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారత ఐటీ కంపెనీలకు చైనాలో యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా ఈ కంపెనీలు చైనాలోని తయారీ కంపెనీలకు అవసరమైన ఐటీ సేవలు అందిస్తున్నాయి.
ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు సగం మంది స్థానిక చైనీ యులే. వైరస్ భయంతో భారత ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని చేయమని తమ ఉద్యోగులకు చెప్పాయి. వైరస్ ప్రభావం లేని ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి పని చేయిస్తున్నాయి. దీంతో ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
also read రిలయన్స్ జియో కొత్త లేటెస్ట్ రిచార్జ్ ప్లాన్... ఇతర నెట్వర్క్ల కంటే చౌకగా...
ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలకు చైనా ఏమంత పెద్ద మార్కెట్ కాదు. అమెరికా, ఐరోపా దేశాలే ఈ కంపెనీలకు పెద్ద మార్కె ట్లు. అయితే ఆసియా, పసిఫిక్ దేశాల నుంచి వచ్చే ఐటీ ఆదాయాల్లో 5-7 శాతం వాటా చైనాదే. కరోనా వైరస్ దెబ్బతో చైనా జీడీపీ వృద్ధి రేటు 0.3 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.
త్వరలో పరిస్థితి కుదుటపడకపోతే పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం చైనాలో పని చేస్తున్న భారత ఐటీ కంపెనీలపైనా తప్పదు. మున్ముందు పరిస్థితి ఇంకా దయనీయంగా మారితే భారత ఐటీ కంపెనీల రాబడులకు మరింత గండిపడే అవకాశాలు లేకపోలేదు.
‘కొన్ని భారత ఐటీ కంపెనీలు చైనాలోని తయారీ కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్నాయి. మధ్య, దీర్ఘకాలంలో ఈ కంపెనీలపై కరోనా ప్రభావం పరోక్షంగానైనా తప్పకుండా ఉంటుంది’ అని నాస్కామ్ వైస్ చైర్మన్, ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు తెలిపారు. ఆర్థికంగా దెబ్బ తింటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీరేట్లకే రుణాలివ్వాలని చైనాలోని బ్యాంకులను ఆ దేశ ఆర్థిక నియంత్రణ సంస్థలు కోరుతున్నాయి.
also read ఏజీఆర్ బకాయిల వల్లే 5జీ ట్రయల్స్ ఆలస్యం?
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్ చైనా. హెచ్-1 వీసాల జారీపై అమెరికా ఆంక్షలు విధించడంతోపాటు బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత ఐటీ దిగ్గజాలకు చైనా ఆకర్షణీయ మార్కెట్ గా నిలిచింది. అయినా చైనాలో భారత ఐటీ దిగ్గజాలు కేవలం శాఖల రూపంలో, సబ్సిడీయరీలు, జాయింట్ వెంచర్ కంపెనీలుగా, పూర్తిగా విదేశీ సంస్థలుగా సేవలందిస్తున్నాయి.
స్థానిక నిపుణులను భారత ఐటీ సంస్థలు చైనాలో నియమించుకుంటున్నాయి. భారత, చైనా కంపెనీల భాగస్వామ్యంతో డాలియన్ గుయియాంగ్, జుజౌల్లో మూడు ఐటీ కారిడార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, బిగ్ డేటా తదితర టెక్నాలజీలపై కేంద్రీకరించి ఈ సంస్థలు పని చేస్తున్నాయి.
నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ గగన్ సభర్వాల్ మాటల్లో చెప్పాలంటే భారత ఐటీ పరిశ్రమపై కరోనా ప్రభావం చాలా తక్కువే అని, చైనా ఆర్థిక వ్యవస్థపైనే పూర్తి ప్రభావం పడుతుంది. ఉత్పాదక రంగంతో అనుబంధ రంగాలపై మాత్రం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీస్ కో లీడర్ అఖిలేశ్ తుతేజా చెప్పారు.