ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన 'పీఎస్‌ఎల్వీ-సీ60'. దీని అసలు ఉద్దేశం ఏంటి

By Narender Vaitla  |  First Published Dec 30, 2024, 10:18 PM IST

అంతరిక్షరంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీహరికోటలో షార్‌ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-60ని శాస్త్రవేత్తలు సోమవారం విజయవంతంగా ప్రయోగించారు.. 
 


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60ని విజయవంతంగా ప్రయోగించారు. ఆదివారం రాత్రి 8.58 గంటలకు మొదలైన కౌంటింగ్ సోమవారం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. శ్రీహరికోట షార్‌ నుంచి ప్రయోగాన్ని నిర్వహించారు. ఛేజర్‌, టార్గెట్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-60 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం మొత్తం బరువు 400 కిలోలుగా ఉంది. భారత్‌ సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఈ ప్రయోగంతో శ్రీకారం చుట్టినట్లైంది. 

Latest Videos

ఉపయోగం ఏంటంటే.. 

పీఎస్‌ఎల్వీ సీ60 ద్వారా స్పాడెక్స్‌ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపించింది. ఈ జంట ఉపగ్రహాలకు శాస్త్రవేత్తలు ఛేజర్, టార్గెట్ అనే పేర్లను పెట్టారు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో ప్రయోగించనున్న చంద్రయాన్‌ 4లో, భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా భారత్‌ అవతరించింది. 

అంతరిక్షంలో ఇతర శాటిలైట్లను అనుసంధానించడం, అంతరిక్ష వ్యర్థాల తొలగించేలా ఉపగ్రహాలను రూపకల్పన చేశారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకింగ్ మిషన్‌ను నింగిలోకి పంపిన దేశంగా భారత్ అవతరించింది. సాధారణంగా అంతరిక్షంలో వ్యోమనౌకలు గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వ్యోమనౌకల వేగాన్ని నియంత్రించుకుంటూ ఒకదానికొకటి చేరువవుతూ, కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఈ ప్రాసెస్‌లో ఏమైనా తేడా వస్తే వ్యోమనౌకలు ఢీకొని విచ్చిన్నమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రయోగం ఎంతో క్లిష్టమైందిగా చెబుతుంటారు. ఈ డాకింగ్ విధానం ద్వారా కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపుతారు. 

ఇస్రో ఛైర్మన్‌ ఏమన్నారంటే.. 

ప్రయోగం విజయవంతమైన వెంటనే ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌. ఎస్‌. సోమనాథ్‌ మాట్లాడారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాహకనౌక ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిందన్నారు. ప్రయోగానికి సంబంధించిన తదుపరి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇస్రో అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వండని ఆయన సూచించారు.

 

click me!