ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

By Sandra Ashok Kumar  |  First Published Feb 11, 2020, 4:19 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు విదేశీ వెబ్‌సైట్లలో ’ఈ-కామర్స్‘ సంస్థల నుంచి కొంటే భారం తడిసిమోపెడు కానున్నది. ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదిస్తోంది. సుంకాల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల ‘ఈ-రిటైలర్ల‘ నుంచి కొనుగోళ్ల వల్ల  కొనుగోలుదారులపై దాదాపు 50%  భారం పెరగనున్నది.
 


న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్‌ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్‌ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. 

సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్‌ విధానంలో కస్టమ్స్‌ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం అవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Latest Videos

భారతీయులకు విదేశాల నుంచి వచ్చే బహుమతుల విలువ రూ. 5,000 దాకా ఉంటే పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా పలు చైనా ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. 

also read నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్...

చైనా ఈ కామర్స్ సంస్థల తీరు వల్ల సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్‌ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్‌ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి.

ఇలా విదేశీ ఈ–కామర్స్‌ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్‌ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో దేశీయ ఈ–కామర్స్‌ సంస్థలకు నష్టం వాటిల్లుతోందని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్‌ చైర్మన్‌ సచిన్‌ తపారియా తెలిపారు.  

కస్టమ్స్‌ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్‌ విభాగం నిషేధం విధించింది. 

ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం విధించడంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలక ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్‌ మార్గంలో విదేశీ ఈ–కామర్స్‌ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.

also read వోడాఫోన్ నుండి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌...ఇక ఉచిత కాల్స్....

తాజాగా విదేశీ షాపింగ్‌ పోర్టల్స్‌ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే లోకల్‌సర్కిల్స్‌ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలను కేంద్రం సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్‌ విభాగం సొంత పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ను వినియోగంలోకి తీసుకొస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్‌ సంస్థలు భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్‌ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. 

లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్‌ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్‌ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్‌ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది.

ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్‌ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదం లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్‌ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్‌ చైర్మన్‌ సచిన్‌ తపారియా తెలిపారు.

click me!