క్యాష్ బ్యాక్ పేరిట రూ.1.47 లక్షల మేరకు మోసం జరిగింది. పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడిననే పేరుతో ఓ మోసగాడు కాజేశాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్ల డేటా లీక్‌లో కంపెనీ పాత్ర దర్యాప్తు చేస్తామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.
ఘజియాబాద్: పేటీఎం క్యాష్‌బాక్‌ల పేరుతో మోసాలు బాగా సాగుతున్నాయి. ఇటువంటి మోసాలు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో మరీ ఎక్కువయ్యాయి. పేటీఎం క్యాష్‌బాక్ వస్తుందంటూ చెప్పి, ఫేక్ ఫోన్‌కాల్స్‌తో ప్రజలను కొందరు మోసగాళ్లు దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కేటుగాడు తాను పేటీఎం ఉపాధ్యక్షుడినని చెప్పుకుని ఒకరికి ఫోన్ చేసి మోసగించాడు. బాధితుడు ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పేటీఎం టాప్‌బాస్‌లపై కేసు నమోదైంది.
ఘజియాబాద్ వాసి రాజ్‌కుమార్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, అతని సోదరుడు, ఉపాధ్యక్షుడు అజయ్ శేఖర్ శర్మలతోపాటు, మరికొందరు సీనియర్ ఆఫీసర్లపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేశారు.
also read జియోకు అదిరిపోయే షాక్: రూపాయికే 1 జీబీ డేటా....
మోసానికి గురయిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ల ఇన్ఫర్మేషన్ ఏదైనా పేటీఎం నుంచి లీకైందా? అనే విషయాన్ని దర్యాప్తు చేసేందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయుర్వేదం మందులు అమ్మే రాజ్‌కుమార్ సింగ్ ఈ మోసంలో రూ. 1.50 లక్షలు పోగొట్టుకున్నాడు.కిందటేడాది డిసెంబర్ 28వ తేదీన సింగ్‌కు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్‌నంటూ రాజ్‌కుమార్ సింగ్‌కు పరిచయం చేసుకున్నాడు. నాకు క్యాష్‌బాక్ వచ్చిందని, పేటీఎం బ్యాంక్ నుంచి ఒక లింక్ పంపుతానని ఆగంతకుడు చెప్పాడు.
ఆ లింక్‌ను క్లిక్ చేయాలని చెప్పడంతో, తనకు కొంత అనుమానం కలిగిందని రాజ్ కుమార్ తెలిపాడు. ఎందుకంటే పేటీఎం ఎప్పుడూ అలా అడగలేదని పేర్కొన్నాడు. మరింత నమ్మకం కలిగించడానికి ఆ కేటుగాడు రాజ్‌కుమార్ సింగ్ పేటీఎం పాత ట్రాన్సాక్షన్స్ వివరాలను మొత్తం చదివి వినిపించాడు.
‘ఆ మోసగాడు చెప్పిన వివరాలలో నా మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్‌తోపాటు, ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషనూ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ పేటీఎం ఉద్యోగులకు తప్ప మరెవరికీ తెలుసుకునే వీలుండదు కదా అనే ఉద్దేశంతో ఆ లింక్‌ను క్లిక్ చేశాను’ అని రాజ్‌కుమార్ సింగ్ వెల్లడిస్తున్నాడు. ఇలా క్లిక్ చేశానో లేదో నా ఖాతా నుంచి రూ. 1.47 లక్షలు మాయమైందని వాపోతున్నాడు.
also read ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి
కస్టమర్ల డేటా బయటకు పోవడంలో పేటీఎం కంపెనీ బాధ్యత ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థను వినియోగించే వాళ్లకు ఇదొక పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు.కస్టమర్ల డేటా తీసుకునే కంపెనీలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఉండాలని ఘజియాబాద్ పోలీస్ చీఫ్ కళానిధి నైథని వ్యాఖ్యానించారు.
ఐతే, అలాంటి ఫోన్ కాల్ తానేప్పుడూ చేయలేదని పేటీఎం ఉపాధ్యక్షుడు అజయ్ శేఖర్ శర్మ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అబద్దమని చెప్పారు. డేటా ఎలా లీకైందనేది దర్యాప్తులో తేలుతుందని ఘజియాబాద్ పోలీస్ చీఫ్ కళానిధి నైథని పేర్కొన్నారు. పోలీసు దర్యాప్తులో నిజాలన్నీ బయట పడతాయన్నారు. తామెప్పుడూ కస్టమర్ల కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాల కోసం కాల్స్ చేయమని పేటీఎం బ్యాంక్ పేర్కొన్నది.