టెలికం శాఖకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడంతో కేంద్రం దిగి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి లోగా బకాయిలు చెల్లించాలని టెలికం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది టెలికం శాఖ. కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో తెలియజేయాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను నిలదీసింది. ఈ నేపథ్యంలో టెలికం శాఖ జారీ చేసిన ఆదేశాలపై స్పందించిన ఎయిర్ టెల్ ఈ నెల 20 లోపు రూ.10 వేల కోట్లు చెల్లిస్తామని వెల్లడించింది.
న్యూఢిల్లీ: బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్ శాఖ డెడ్‌లైన్ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
శుక్రవారం అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సర్కిల్, జోనళ్ల వారీగా టెలికాం శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రారంభించినట్టు పేర్కొంది.
also read సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు
టెలికం శాఖ ఆదేశాలతో ఎయిర్ టెల్ దిగి వచ్చింది. బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 20న రూ.10వేల కోట్లు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఏజీఆర్ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని సుప్రీంకోర్టు శుక్రవారం టెలికాం సంస్థలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.
న్యాయస్థానం ఆదేశాల్ని సైతం ఎందుకు పాటించలేదంటూ టెలికం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. సంస్థల నుంచి బకాయిలను రాబట్టడంలో విఫమయ్యారంటూ కేంద్ర ప్రభుత్వంపైనా అసహనం వ్యక్తంచేసింది.
ఏజీఆర్ ఛార్జీల రూపేణా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి రూ.92 వేలకోట్లు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటివరకు బకాయిలు చెల్లించకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ సహా మిగిలిన టెలికాం సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.
2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, టాటా టెలీసర్వీస్లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.
తమ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలను గడువులోగా టెలికాం విభాగానికి (డీఓటీ) చెల్లించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో తెలపాలని ఆదేశించింది. జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం డీఓటీ డెస్క్ ఆఫీసర్ ఉత్తర్వుపై అభ్యంతరం తెలిపింది.
also read చైనా టీవీల దిగుమతిపై ఆంక్షలు...ఆర్థికశాఖ కీలక నిర్ణయం..
టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని తాము ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డీఓటీ డెస్క్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ అర్థంపర్థంలేని దాన్ని ఎవరు సృష్టిస్తున్నారో మాకు తెలియడం లేదు. అసలు ఈ దేశంలో న్యాయం ఉందా! దీనిని చూస్తూ ఇక్కడ ఉండడం కంటే దేశం విడిచిపోవడం మంచిది’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కంపెనీల వారీగా ఎయిర్‌టెల్ రూ.21,682.13 కోట్లు, వొడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు, ఆర్‌కాం రూ.16,456.47 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,098.72 కోట్లు, ఎంటీఎన్‌ఎల్ రూ.2,537.48 కోట్లు టెలికం శాఖకు చెల్లించాల్సి ఉంది.