తమిళనాడు ఎన్నికలు: పారుతున్న పీకే వ్యూహాలు, డీఎంకేదే విజయమన్న సర్వేలు

By Siva KodatiFirst Published Mar 26, 2021, 3:44 PM IST
Highlights

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యంత ఆసక్తి కలిగిస్తున్న రాష్ట్రం తమిళనాడు. రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కొత్త నాయకత్వాలు రణరంగంలో ఎలా నిలబడతాయోనని ఉత్కంఠ నెలకొంది.

పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తుండగా, హ్యాట్రిక్ కొట్టాలని అధికార అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. 

అయితే తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమికి 170 స్థానాలు వస్తాయని సర్వేలు నిగ్గుతేల్చాయి.

డీఎంకే బలం రెట్టింపు కావడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు వున్నాయి. రెండేళ్ల క్రితం ఐప్యాక్‌తో డీఎంకే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో తమ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను ప్రశాంత కిషోర్ (పీకే)పై పెట్టారు స్టాలిన్.

తొలి దశలో తమిళనాడు పరిస్థితులను డీఎంకే బలాలు, బలహీనతలు అంచనా వేసిన పీకే బృందం తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఎన్నికల నాటికి డీఎంకేను బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించింది.

తమిళనాడులో చెన్నై సహా పలు చోట్ల ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క చెన్నైలోనే 3 వందల మంది యువతీ యువకులు పనిచేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా వెయ్యిమందిని రిక్రూట్ చేసుకున్న ఈ సంస్థ వారి చేత వరుస సర్వేలు చేయించింది.

ఏడాదిగా స్టాలిన్ ఇమేజ్‌ను పెంచడంలో ఐ ప్యాక్ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజలను ఆకర్షించే విధంగా పోస్టర్లు, బ్యానర్లు రూపొందించింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు దరఖాస్తులు పెట్టుకోవాలనుకున్న వారి కోసం అక్కడక్కడా బాక్సులు ఏర్పాటు చేస్తే జనం వాటిలో తమ వినతులు వేశారు.

కొన్నింటికి స్టాలిన్ స్వయంగా సమాధానాలు రాయడం విశేషం. తాము అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామంటూ కొందరికి సందేశం పంపారు. ఇది స్టాలిన్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగడానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.

click me!