
World Boxing Championships 2025 India Squad: యూకే లోని లివర్‌పూల్‌లో సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025 జరగనుంది. దీని కోసం భారత్ 20 మంది బాక్సర్లతో బలమైన జట్టును ప్రకటించింది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న లవ్లీనా బోర్గోహైన్, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్ జరీన్, అలాగే సీనియర్ బాక్సర్ పూజా రాణి ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు.
ఈ టోర్నమెంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కొత్తగా ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ఎడిషన్. మొత్తం 65 దేశాల నుండి 550కి పైగా బాక్సర్లు పాల్గొంటున్నారు. ఇందులో పారిస్ 2024 ఒలింపిక్స్ పతక విజేతలైన 17 మంది కూడా ఉండటం విశేషం.
మహిళా విభాగంలో లవ్లీనా 75 కిలోల విభాగంలో, నిఖత్ 51 కిలోల విభాగంలో, పూజా రాణి 80 కిలోల విభాగంలో బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురు బాక్సర్లు ప్యారిస్ 2024 తర్వాత తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొంటున్నారు.
పురుషుల విభాగంలో ఆసియా గేమ్స్ కాంస్య విజేత నరేందర్ బెర్వాల్ (90+kg), వరల్డ్ బాక్సింగ్ కప్ స్వర్ణ పతక విజేతలు హితేష్ గూలియా (70kg), అభినాష్ జామ్‌వాల్ (65kg) కీలక ఆటగాళ్లు.
మహిళలు: మీనాక్షి హూడా (48kg), నిఖత్ జరీన్ (51kg), సాక్షి (54kg), జైస్మిన్ లాంబోరియా (57kg), సంజు ఖత్రి (60kg), నీరజ్ ఫోగాట్ (60kg), సనమచా చాను (70kg), లవ్లీనా బోర్గోహైన్ (75kg), పూజా రాణి (80kg), నూపుర్ శియోరన్ (80+kg)
పురుషులు: జడుమణి సింగ్ మండెంగ్బం (50kg), పవన్ బార్ట్‌వాల్ (55kg), సచిన్ సివాచ్ జూనియర్ (60kg), అభినాష్ జామ్‌వాల్ (65kg), హితేష్ గూలియా (70kg), సుమిత్ కుందు (75kg), లక్ష్య చాహర్ (80kg), జుగ్నూ అహ్లావత్ (85kg), హర్ష్ చౌదరి (90kg), నరేందర్ బెర్వాల్ (90+kg)
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025 నాకౌట్ ఫార్మాట్లో జరుగుతుంది. గెలుపొందినవారు తర్వాతి దశకు వెళతారు. సెమీ ఫైనల్ ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి. ప్రతి బౌట్‌లో మూడు నిమిషాల మూడు రౌండ్లు ఉంటాయి. జడ్జీలు "టెన్ పాయింట్ మస్ట్" సిస్టమ్‌తో నిర్ణయం తీసుకుంటారు.
• క్వార్టర్ ఫైనల్స్: సెప్టెంబర్ 10
• సెమీ ఫైనల్స్: సెప్టెంబర్ 12, 13
• ఫైనల్స్: సెప్టెంబర్ 14
టోర్నీ చివరి రోజు మొత్తం 20 మంది బాక్సర్లు కొత్త వరల్డ్ ఛాంపియన్ కిరీటం సొంతం చేసుకోనున్నారు. ఇక భారత్ తరఫున బరిలోకి దిగబోతున్న ఈ 20 మంది బాక్సర్లు లివర్‌పూల్‌లో ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతున్నారు. లవ్లీనా, నిఖత్ వంటి స్టార్ బాక్సర్లు ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.