
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సూపర్-12 మ్యాచ్ లకు ముందు ఆస్ట్రేలియా (Australia) మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచకప్ తో పాటు త్వరలో జరుగబోయే యాషెస్ సిరీస్ (Ashes series) ను కూడా ఆసీస్ నెగ్గాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లలో రాణించకుంటే ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ (justin longer) కు ఉద్వాసన తప్పదన్నట్టు వ్యాఖ్యలు చేశాడు.
గిల్ క్రిస్ట్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘వాళ్లు (ఆసీస్ ఆటగాళ్లు) ఈ మెగా టోర్నీతో పాటు డిసెంబర్-జనవరిలో జరుగబోయే యాషెస్ సిరీస్ లో కూడా భాగా ఆడాలి. ఈసారి యాషెస్ ను తిరిగి నిలబెట్టుకోకుంటే మాత్రం జట్టులో సీనియర్ ప్లేయర్ల స్థానాలు ప్రమాదకరంలో ఉంటాయి. ఆ స్థానాలను భర్తీ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు’ అని అన్నాడు.
అంతేగాక.. ఒకవేళ ఈ రెండు టోర్నీలలో విఫలమైతే గనుక ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ పదవికి ఎసరు వస్తుందని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అతడు మరింత ప్రమాదంలో ఉన్నట్టే లెక్క అని చెప్పకనే చెప్పాడు.
పలు కారణాల వల్ల తాము ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ ను నెగ్గలేకపోయామని గిల్ క్రిస్ట్ అన్నాడు. అత్యుత్తమ జట్టును ఎంపిక చేయలేకపోవడమో లేక ఆటగాళ్లు సరైన ఫామ్ లో లేకపోవడమో వంటివి జరిగాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ప్రస్తుత జట్టు సభ్యులపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ టోర్నమెంట్ కోసం ఎంపికచేసిన వారిలో మంచి నైపుణ్యాలున్నాయి. ఇక ఉపఖండంలో పరిస్థితులు సాపేక్షంగా, తటస్థంగా ఉంటాయి. ఇప్పుడున్న జట్టులో చాలా మంది ఐపీఎల్ (IPL) కోసం యూఏఈలో మంచి క్రికెట్ ఆడారు. కాబట్టి వారికి అక్కడి పరిస్థితులమీద అవగాహన వచ్చింది’ అని తెలిపాడు.