లైంగిక వేధింపుల ఆరోపణలు.. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేస్తాం.. సుప్రీంకు తెలిపిన పోలీసులు..

By Sumanth Kanukula  |  First Published Apr 28, 2023, 4:05 PM IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి  తెలిసిందే.  అయితే ఆయనపై కేసు నమోదు చేయనున్నట్టుగా ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలిపారు. 
 


రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి  తెలిసిందే.  బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజర్లు పోరాటాన్ని  కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెజ్లర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు కీలక పరిణామాం చోటుచేసుకుంది. బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై ఈరోజు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తామని ఢిల్లీ పోలీసులు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.

రెజర్ల పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు లైంగిక వేధింపుల గురించి పిటీషన్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

Latest Videos

undefined

ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర ట్రైనర్‌లపై  లైంగిక ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు మొదట వీధుల్లోకి వచ్చారు. అయితే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ మేరకు కొన్ని  రోజులకు వారు నిరసనను ఉపసంహరించుకున్నారు. అయితే తమ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వారు గత కొద్దిరోజుల మరోసారి నిరసనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే వరకు తాము అక్కడే  ఉంటామని తేల్చి చెప్పారు. నిరసనకు దిగినవారిలో సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి స్టార్ రెజ్లర్లు కూడా ఉన్నారు.

ఇక, నిరసనకు దిగిన రెజర్లు తమ సమస్యలను కలిసి చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రధాని మోదీ ‘‘బేటీ బచావో- బేటీ పఢావో’’ గురించి మాట్లాడతారని.. ప్రతి ఒక్కరి ‘‘మన్ కీ బాత్’’ వింటారని.. ఆయన తమ మన్ కీ బాత్ వినలేరా అని ఒలింపియన్ సాక్షి మాలిక్ ఇటీవల మీడియా సమావేశంలో అడిగారు. 

ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ గురువారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. నిస్సహాయుడిని అని భావించిన రోజే తాను చనిపోయినట్లు అని చెప్పుకొచ్చారు. ‘‘మిత్రులారా, నేను ఎప్పుడూ జీవితంలో పొందిన లేదా కోల్పోయిన వాటి గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉంటాను. పోరాడే శక్తి నాకు లేదని భావించిన రోజు; నేను నిస్సహాయుడినని భావించే రోజు, అలాంటి జీవితాన్ని గడపకూడదని కోరుకుంటాను. ఆ రోజు నేను మరణించాలని కోరుకుంటున్నాను. లేదా అలాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు, మృత్యువు నన్ను తన కౌగిలిలోకి తీసుకోవాలని ప్రార్థిస్తాను’’ అని బ్రిజ్ భూషణ్ వీడియోలో పేర్కొన్నారు. 

రెజ్లర్ల నిరసనను భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష విమర్శించారు. వారి నిరసన ‘‘క్రమశిక్షణా రాహిత్యానికి సమానం’’ అని పేర్కొన్నారు. వారి ఆరోపణలను పరిశీలిస్తున్న కమిటీ నివేదిక కోసం వేచి ఉండాల్సిందని అన్నారు. అయితే పీటీ ఉష ప్రకటనతో తాము బాధపడ్డామని రెజ్లర్లు తెలిపారు. ఆమె నుంచి తాము మద్దతు వస్తుందని  భావించామని చెప్పారు. 

click me!