Paris Olympic: భార‌త్ కు రెండో ఒలింపిక్ మెడ‌ల్.. ఎవ‌రీ సరబ్‌జోత్ సింగ్?

By Mahesh Rajamoni  |  First Published Jul 30, 2024, 11:08 PM IST

Paris Olympic - Sarabjot Singh : భారతదేశానికి పారిస్ ఒలింపిక్స్  2024లో రెండో మెడ‌ల్ ను అందించారు మను భాకర్-సరబ్‌జోత్ సింగ్ జోడీ. పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్ తో క‌లిసి భార‌త్ కు రెండో మెడ‌ల్ అందించిన ఈ 22 ఏళ్ల సరబ్‌జోత్ సింగ్ ఎవ‌రు?


Who is Sarabjot Singh? : పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ రెండో మెడ‌ల్ గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత యువ షూటింగ్ జంట సరబ్‌జోత్ సింగ్-మను భాకర్ లు పారిస్ ఒలింపిక్స్ 2024 లో కాంస్య పతకం గెలుచుకున్నారు. భార‌త స్టార్ షూటింగ్ జోడీ మను-సరబ్‌జోత్ లు దక్షిణ కొరియాపై మొద‌టి నుంచి ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తూ 16-10తో ఓడించి ఒలింపిక్స్‌లో భారత్ కు రెండో మెడ‌ల్ అందించారు. అంత‌కుముందు మ‌ను భాక‌ర్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మెడ‌ల్ సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి క్రీడాకారిణిగా మను భాక‌ర్ స‌రికొత్త రికార్డు సృష్టించారు. కాగా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ తర్వాత ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన‌ సరబ్‌జోత్ సింగ్ మొదటి భారతీయ షూటర్‌గా నిలిచాడు. 

ఎవ‌రీ సరబ్‌జోత్ సింగ్?

Latest Videos

undefined

సరబ్‌జోత్ సింగ్ హర్యానాలోని బరారా బ్లాక్ అంబాలాలోని ధీనా జాట్ గ్రామానికి చెందినవాడు . అతని తండ్రి జతీందర్ సింగ్ ఒక‌ రైతు. తల్లి హర్దీప్ కౌర్ గృహిణి. చండీగఢ్ సెక్టార్ 10లోని డీఏవీ కళాశాలలో విద్య‌ను పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత సెంట్రల్ ఫీనిక్స్ క్లబ్‌లో ఉన్న అంబాలా కాంట్‌లోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో కోచ్ అభిషేక్ రాణా వద్ద షూటింగ్ లో శిక్షణ పొందాడు. 2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేతగా సీనియర్ ర్యాంక్‌లోకి ప్రవేశించినసరబ్‌జోత్ సింగ్.. 2023లో ఆసియా క్రీడల జట్టు స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్ రజతం సాధించాడు. అలాగే, 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత కాంస్యాన్ని కూడా గెలుచుకున్నాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హ‌త  సాధించాడు.

షూటింగ్‌లో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన భారత అథ్లెట్లు వీరే..

 

సరబ్‌జోత్ సింగ్ మొదట్లో ఫుట్‌బాల్ ఆటగాడు కావాలనుకున్నాడు, కానీ వేసవి శిబిరంలో పిల్లలు పిస్టల్స్‌తో టార్గెట్ లు ఎంచుకుని షూటింగ్ చేయ‌డం చూసి త‌న ఆస‌క్తి మారిందని ప‌లుమార్లు చెప్పాడు. అప్ప‌టినుంచి అత‌ను షూటింగ్ కు మారాడు. షూటింగ్ శిక్ష‌ణ‌కు అయ్యే ఖర్చు కారణంగా అతని తండ్రి మొదట విముఖత చూపినప్పటికీ, సరబ్‌జోత్ సింగ్ తన తల్లిదండ్రులను షూటింగ్‌ని కెరీర్‌గా కొనసాగించాలనే తన నిర్ణయానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించగలిగాడు. తన తొలి జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత సరబ్‌జోత్ సింగ్ 2016 నుండి అతని శిక్షకుడిగా ఉన్న అభిషేక్ రాణా ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ కోచింగ్ పొందడం ప్రారంభించాడు.

డిసెంబర్ 2022లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సరబ్‌జోత్ సింగ్ జట్టు ఈవెంట్‌లో విజయం సాధించి రెండు బంగారు పతకాలను గెలుచుకుంది. భోపాల్‌లోని మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇది జరిగింది. 2021 జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, సరబ్‌జోత్ సింగ్ జట్టు, మిక్స్‌డ్-టీమ్ ఈవెంట్‌లలో బంగారు పతకాలను సాధించాడు. అతను మార్చి 2023లో ప్రపంచ కప్‌లోని మొదటి ఫైనల్ మ్యాచ్‌లో 16-0 ఖచ్చితమైన స్కోరుతో బంగారు పతకాన్ని సాధించడంతో తన షూటింగ్ ప‌వ‌ర్ ను ప్ర‌పంచానికి చూపించాడు. ఈ షూటింగ్ పోటీల‌ మొత్తంలో 585 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ కు మెడ‌ల్ అందించి యావ‌త్ భార‌తావ‌నిని గ‌ర్వించేలా చేశాడు. 

PARIS OLYMPICS : గ్రూప్ స్టేజ్‌లో టాప్ లో భారత హాకీ జట్టు.. క్వార్టర్స్ బెర్త్ ఖాయం

click me!