సెహ్వాగ్ అలాగే ఆడేవాడు: ధావన్ ఉద్వాసనపై వివీఎస్ ఫైర్

By pratap reddyFirst Published Aug 11, 2018, 5:08 PM IST
Highlights

ఇంగ్లాండుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తుది జట్టు నుంచి శిఖర్ ధావన్ ను తొలగించడంపై హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివీఎస్ లక్ష్మణ్ మండిపడ్డాడు.

లండన్‌: ఇంగ్లాండుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తుది జట్టు నుంచి శిఖర్ ధావన్ ను తొలగించడంపై హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివీఎస్ లక్ష్మణ్ మండిపడ్డాడు.  తొలి టెస్టులో కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారని, రెండో టెస్టుకి ధావన్‌‌ని మాత్రమే తుది జట్టు నుంచి తప్పించడం భావ్యం కాదని ఆయన అన్నాడు.

తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌తో పోలిస్తే శిఖర్ ధావన్‌ కాస్తా మెరుగ్గా బ్యాటింగ్ చేశాడని, అతని ఫుట్‌వర్క్‌ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుందని అన్నాడు.  లార్డ్స్ టెస్టుకు అతన్ని తప్పించడాన్ని కారణంగా అతను ఔటైన తీరుని చూపిస్తున్నారని అన్నాడు. 

ఒక స్ట్రోక్‌ ప్లేయర్‌ స్లిప్‌లో బంతిని తరలించే ప్రయత్నంలో కొన్ని సార్లు వికెట్‌ను చేజార్చుకోవచ్చునని, గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలానే ఆడేవాడని, వారికి ఆ షాట్లే బలమని అన్నాడు. 

విదేశీ గడ్డపై ధావన్‌తో పాటు టాప్ ఆర్డర్‌లోని కొంత మంది బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానంగా 2015 నుంచి టాప్‌-4లో ఉన్న ఆటగాళ్లు విదేశాల్లో తడబడటం చూస్తునే ఉన్నామని అన్నాడు. ఇక్కడ పుజారా కూడా విఫలమైన వారిలో ఒకడని, ఎందుకో ప్రతిసారీ ధావన్‌పైనే వేటు పడుతోందని వివీఎస్ లక్ష్మణ్ అన్నాడు.

click me!