Vignesh Puthur విఘ్నేష్ పుథూర్: వినయ్ కుమార్ పట్టిన మలప్పురం గోల్డ్ బాయ్ స్టోరీ!

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున విఘ్నేశ్ పుతూర్ మెరుపు బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ స్పిన్నర్ గురించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Vignesh puthur story from auto driver son to IPL star in telugu

ధోని టీమ్ CSKతో తలపడుతూ నిన్న ఒక కొత్త కుర్రాడు స్పిన్ తో బంతిని తిప్పేస్తుంటే క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యంగా చూసింది. ఎవరితడు..? ఎక్కడినుంచి వచ్చాడు..?  ముంబై వాళ్ళు ఎక్కడ  వెతికి పట్టుకొచ్చారు..? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మెదిలాయి.  కుర్రాడి బ్యాక్‌గ్రౌండ్ వెతుక్కుంటూ పోతే తెలిసిన సమాధానం ఏంటంటే.. అతను కేరళలోని మలప్పురంకు చెందిన ఒక ఆటో డ్రైవర్ కొడుకు. విఘ్నేష్ పుథూర్.. ఇంకా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అప్పుడే ముంబై ఇండియన్స్ టీమ్‌లో చేరాడంటే.. వాళ్ళకు ఎలా చిక్కాడు..? 

బురదలోనే తామర పువ్వు పుడుతుంది, బురదలోనే వికసిస్తుంది..

Latest Videos

ఒక సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు.. ఐపీఎల్‌లో ఒక పెద్ద ఫ్రాంచైజీ తరపున ఆడే అవకాశం వస్తుందంటే ఇది సాధారణ విషయం కాదు.. మలప్పురంకు చెందిన ఈ బంగారాన్ని వెతికి తీసుకొచ్చింది కర్ణాటక దావణగెరె ఎక్స్‌ప్రెస్ ఆర్.వినయ్ కుమార్.

కేరళ T20 లీగ్‌లో Alleppey Ripples టీమ్ తరపున ఆడుతున్న కుర్రాడు.. ఆడింది మూడే మ్యాచ్‌లు, తీసింది రెండే వికెట్లు.. కానీ ఎవరి కళ్ళకు పడాలో పడ్డాడు ఆ రోజు..

కుల్దీప్ యాదవ్‌లా, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్‌లా విఘ్నేష్ ఎడమ చేతి మణికట్టు సహాయంతో బంతిని తిప్పుతుంటే ఒక కన్ను అతన్ని ఆసక్తిగా గమనించింది. అది మన వినయ్ కుమార్ కన్ను. రిటైర్మెంట్ తర్వాత వినయ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్కౌటింగ్ టీమ్‌లో ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న చోటుకు వెళ్ళి అక్కడి నుంచి కొత్త కొత్త టాలెంట్‌లను వెలికి తీయడం ఈ స్కౌటింగ్ వింగ్ పని. 

ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ కళ్ళు, చెవులు ఎంత చురుగ్గా ఉంటాయంటే.. టాలెంట్ దేశంలో ఎక్కడ ఉన్నా ముందు ఆ టీమ్ కళ్ళకు పడాల్సిందే. ఒక జస్ప్రీత్ బుమ్రా, ఒక హార్దిక్ పాండ్యా, ఒక తిలక్ వర్మ.. ఇలా ముంబై ఇండియన్స్ తరపున ఈరోజు స్టార్‌లుగా ఉన్న వాళ్ళందరినీ వెతికింది ఇదే స్కౌటింగ్ టీమ్. ఆ స్కౌటింగ్ టీమ్‌కు ఏడాది పొడవునా ఇదే పని.. దేశంలో ఎక్కడ T20 క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నా.. అక్కడ ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు.. T20 లీగ్‌లే కాదు.. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలపై ఆ స్కౌటింగ్ టీమ్ డేగ కన్ను వేసి ఉంటుంది. 

 2016.. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో P1 స్టాండ్‌లో కూర్చొని ఒకాయన రంజీ మ్యాచ్ చూస్తున్నారు. ఆయన జాన్ రైట్.. సౌరవ్ గంగూలీ భారత టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ టీమ్‌కు కోచ్‌గా ఉన్న వ్యక్తి. ఆయనకు ఈ రంజీ మ్యాచ్‌లో ఏం పని అని అడిగితే, ఆయన వచ్చింది ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ తరపున. అప్పుడు ఆయన ముంబై ఫ్రాంచైజీకి హెడ్ ఆఫ్ ది టాలెంట్ స్కౌటింగ్ వింగ్‌గా ఉన్నారు. 2021 నుంచి వినయ్ కుమార్ ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్‌లో ఉన్నాడు. కర్ణాటక టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు వినయ్ చాలామంది యంగ్ టాలెంట్స్‌ను ప్రోత్సహించాడు. చెవులకంటే కళ్ళు చురుగ్గా ఉండే మనిషి. చెవులు చురుగ్గా ఉంటే కావాల్సిన మాటలతో పాటు వద్దనుకునే శబ్దాలు కూడా వినబడతాయి. కానీ కళ్ళు చురుగ్గా ఉంటే.. నిజం తెలుస్తుంది. వినయ్ కుమార్ చెవులను కాదు, కళ్ళను మాత్రమే నమ్మే లీడర్. అందుకే ఆయన లీడర్‌షిప్‌లో కర్ణాటక టీమ్ దేశీయ క్రికెట్‌లో ఏ టీమ్ చేయలేని రికార్డులు క్రియేట్ చేసింది, ఏ కాలంలోనూ అందుకోలేని ఎత్తుకు ఎదిగింది.

కేరళ T20 లీగ్‌లో ఆడుతున్న విఘ్నేష్ టాలెంట్‌ను గుర్తించిన వినయ్, కుర్రాడు పనికొస్తాడని ముంబై ఇండియన్స్ టీమ్ ట్రయల్స్‌కు పిలిపిస్తాడు. అలా మలప్పురం నుంచి వినయ్ వెతికి తెచ్చింది స్వచ్ఛమైన బంగారాన్ని. ఈరోజు అదే కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్లు తీసి మెరిశాడు. సరైన వ్యక్తులు సరైన స్థానంలో ఉంటేనే ఇలాంటి టాలెంట్స్ వెలుగులోకి వస్తాయి.

vuukle one pixel image
click me!