Tokyo Olympics: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్ లో సౌరభ్ చౌదరి

By team teluguFirst Published Jul 24, 2021, 11:08 AM IST
Highlights

భారత యువకెరటం, భారత పతక ఆశాజ్యోతి సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ లో ఫైనల్స్ కి చేరాడు

షూటింగ్ లో భారత యువకెరటం, భారత పతక ఆశాజ్యోతి సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ లో ఫైనల్స్ కి చేరాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ ఫైనల్స్ కి చేరడంలో విఫలమయ్యాడు. 

షూటింగ్ లో భారత్ పతకాల ఆశలతో బరిలోకి దిగింది. వరల్డ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నవారితోపాటు, వరల్డ్ రికార్డు హోల్డర్స్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడే ముగిసిన మెన్స్  10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ తరుఫున 19 ఏండ్ల సౌరభ్ చౌదరి, మరో ఒలింపియన్ అభిషేక్ వర్మ బరిలోకి దిగారు. 

భారత ఏస్ షూటర్ సౌరభ్ చౌదరి ఫస్ట్ సిరీస్ లో 100 కు 95 పాయింట్లు సాధించాడు. అందులో 10 ఇన్నర్ టెన్స్ ను స్కోర్ చేసాడు. మొత్తంగా అయిదు '10 పాయింటర్' షాట్స్ ను ఆ తరువాత అయిదు '9 పాయింటర్' షాట్లను కాల్చాడు సౌరభ్ చౌదరి. ఆతరువాత సెకండ్ సిరీస్ లో 98 పాయింటర్లను సాధించి అబ్బురపరిచారు. మూడవ రౌండ్లో కూడా 98 పాయింట్లు సాధించి తన పూర్తి దృష్టిని లక్ష్యంపై మాత్రమే నిలుపుతూ దూసుకెళ్లాడు. 

ఇక నాలుగవ సిరీస్ లో సౌరభ్ చౌదరి తానెందుకు మేటి షూటర్నో నిరూపిస్తూ 100 పాయింట్లను సాధించాడు. సౌరభ్ చౌదరిని అక్కడ షూటింగ్ ప్రాంగణంలో చూసిన వారెవరు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. నెక్స్ట్ సిరీస్ లతో 98 పాయింట్లను సాధించి టేబుల్ టాపర్ గా నిలిచాడు. మొత్తంగా 600 పాయింట్లకు గాను 586 పాయింట్లు సాధించిన సౌరభ్ చౌదరి ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. 

ఇక మరో షూటర్ అభిషేక్ వర్మ తొలి రౌండ్లో 94 పాయింట్లు సాధించగా రెండవ సిరీస్ లో 96 పాయింట్లను సాధించాడు. తదుపరి మూడవ సిరీస్ లో అభిషేక్ తన ప్రదర్శనను మెరుగు పరుచుకొని 98 పాయింట్లను సాధించాడు. తదుపరి సిరీస్ లో 97 పాయింట్లు సాధించి టేబుల్ లో టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. ఆ తదుపరి రౌండ్ తరువాత 575 పాయింట్లు సాధించి ఫైనల్స్ కి క్వాలిఫై అవలేకపోయాడు. లాస్ట్ రౌండ్లో రెండు 8 పాయింటర్ షాట్లను సాధించడంతో అభిషేక్ తన స్థానాన్ని కోల్పోవాలిసి వచ్చింది. 

ఇక నేటి ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో భారతీయ షూటర్లు నిరాశపరిచారు. టాప్ 8 కి అర్హత సాధించలేకపోవడంతో వారు పోటీ నుంచి నిష్క్రమించారు. ఈ ఈవెంట్లో చైనా షూటర్ యాంగ్ కియాన్ గోల్డ్ మెడల్ సాధించి టోక్యో ఒలింపిక్స్ లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ గా నిలిచింది. 

click me!