Tokyo Olympics: 3వ వరుస విజయం... క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

By team teluguFirst Published Jul 29, 2021, 7:12 AM IST
Highlights

మూడవ వరుస విజయంతో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది.

మూడవ వరుస విజయంతో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిక్ ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది.  

నాకౌట్ స్టేజిలో నేడు డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిక్ ఫెల్ట్ తో తలపడ్డ మ్యాచులో పీవీ సింధు విజయం సాధించింది. గ్రూప్ స్టేజిలో తొలి రెండు మ్యాచులను సునాయాసంగా నెగ్గిన సింధు... ఈ మ్యాచులో డెన్మార్క్ ప్లేయర్ పై ఒకింత కష్టించినప్పటికీ... తన గేమ్ లోని వేరియేషన్స్ ప్రదర్శిస్తూ డెన్మార్క్ ప్లేయర్ ని వెనక్కి నెట్టింది. 

తొలి సెట్ ను 21-15 తో గెల్చుకున్న సింధు, తరువాతి సెట్ ను 21- 13తో గెల్చుకొని మ్యాచ్ ను కైవసం చేసుకుంది. తొలి సెట్ లో ఆది నుంచి కూడా సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ... మియా మాత్రం పాయింట్లను అంత తేలికగా స్కోర్ చేసే అవకాశాన్ని సింధుకి ఇవ్వలేదు. ఇద్దారూ బలమైన ప్లేయర్స్ కోర్ట్ లో తలపెడితే షటిల్ మూమెంట్ ఎలా ఉంటుందో నేటి మ్యాచులో కనిపించింది. 

స్మాషెస్,ఫ్లిక్,నెట్ గేమ్ అన్ని సమపాళ్లలో కనిపించాయి. ఇరు ప్లేయర్స్ కూడా తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి శక్తినంతా ధారపోశారు. సింధు మ్యాచులో కొట్టిన స్మాషెస్,కోర్ట్ కవరేజ్ అద్భుతం అనే చెప్పాలి. 

2021లో వీరిరువురు తలపడ్డ రెండు మ్యాచుల్లో ఒకటి సింధు గెలవగా రెండవది మియా గెలిచింది. ఇక నేటి గేమ్ లో మియా ఎక్కడా కూడా సింధుకి పోటీ ఇచ్చే విధంగా కనబడలేదు. అల్ ఇంగ్లాండ్ లో సింధు నుంచి చూసిన క్రాస్ కోర్ట్ డౌన్ స్మాషెస్ ని టోక్యోలో సింధు అటాకింగ్ కి ఎక్కువగా వాడి పాయింట్లను నెగ్గింది. 

తొలి రౌండ్ ను 21-15 తో గెల్చుకున్న సింధు... రెండవ రౌండ్లో వరుస 5 పాయింట్లను సాధించి ప్రత్యర్థిని ప్రెజర్ లోకి నెట్టింది. ఇక అక్కడి నుండి సింధు ఎక్కడా కూడా ఇబ్బంది పడింది లేదు. పూర్తి ఆధిపత్యాన్ని చాలాయిస్తూ 21-13 తో రెండవ సెట్ ని కూడా చేజిక్కించుకుని మ్యాచ్ ను కైవసం చేసుకొని క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. 

click me!