Tokyo Olympics: క్వార్టర్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఓటమి

By team teluguFirst Published Aug 5, 2021, 9:21 AM IST
Highlights

భారత రెజ్లర్, టాప్ సీడ్ వినేష్ ఫోగట్ క్వార్టర్స్ లో బెలారస్ కి చెందిన కలాదీన్స్కాయా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిచెంది. 

భారత రెజ్లర్, టాప్ సీడ్ వినేష్ ఫోగట్ క్వార్టర్స్ లో బెలారస్ కి చెందిన కలాదీన్స్కాయా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిచెంది. ఆది నుంచి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన బెలారస్ రెజ్లర్ వినేష్ కి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా వినేష్ ని పిన్ చేసి విజయం సాధించింది.  

తొలి పీరియడ్ ఆరంభం నుండే బెలారస్ రెజ్లర్ అటాకింగ్ కి దిగి రెండు పాయింట్ల లీడ్ ని సాధించింది. ఆ తరువాత వినేష్ స్కోర్ ని సమం చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ... బెలారస్ రెజ్లర్ మరో రెండు పాయింట్లను సాధించింది. వినీష్ అద్భుతమైన పట్టు తరువాత కూడా ప్రత్యర్థికి పాయింట్లను జడ్జిలు ఇవ్వడంతో భారత డెలిగేషన్ ఛాలెంజ్ చేయడంతో అది సక్సెస్ అయింది. కానీ ఆ తరువాత కూడా బెలారస్ రెజ్లర్ తన ఆధిపత్యాన్ని చలాయించడంతో వినేష్ ఓటమి చెందింది. 

ఇక ఉదయం తొలి రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది వినేష్.  స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది వినేష్ ఫోగట్. 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలతో బరిలో దిగిన వినేష్ పోటీ మధ్యలో గాయపడింది. గాయం తీవ్రత కారణంగా లేవడానికి కూడా కష్టపడిన వినేష్, స్ట్రెచర్ మీద బయటకు వెళ్లి, ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలిసి వచ్చింది.

2016లో 50 కిలోల కేటగిరీలో పోటీపడ్డ వినేష్, 2019 లో 50 కిలోల కేటగిరీ నుండి 53 కిలోల కేటగిరీకి మారింది. ఒలింపిక్స్‌కి కేవలం 18 నెలల ముందు ఇలా వెయిట్ కేటగిరీని మార్చుకోవడం పెనుసవాలే అయినప్పటికీ... తన ప్రతికూలతలపై విజయం సాధించి అధిక వెయిట్ కేటగిరీలో పోరాడడానికి అలవాటుపడింది.

అంతకుముందు తొలి రౌండ్‌లో ఓడిన భారత రెజ్లర్ అన్షూ మాలిక్‌కి రెపఛేజ్ దక్కినా, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, చెక్ రిపబ్లిక్‌కి చెందిన వలరియా కోబ్లోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో పోరాడి ఓడింది అన్షూ... ఆఖరి 30 సెకన్లలో 4 పాయింట్లు సాధించిన వలరియా, అన్షూపై విజయం సాధించింది. ఈ పరాజయంతో అన్షూ మాలిక్ నిరాశగా ఇంటిదారి పట్టింది.

click me!