లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో ఐదో స్థానంలో నిలిచిన భారత రోయర్లు అర్జున్ లాల్ జత్, అర్వింద్ సింగ్...
రిపచాజ్ రౌండ్‌కి అర్హత... నేరుగా సెమీస్ చేరిన ఐర్లాండ్, చెక్ రిపబ్లిక్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రోయింగ్ జట్టు శుభారంభం చేసింది. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత రోయర్లు అర్జున్ లాల్ జత్, అర్వింద్ సింగ్ ఐదో స్థానంలో నిలిచి, రిపచాజ్‌కి అర్హత సాధించారు.
6:40.33 నిమిషాల్లో రేసును ముగించిన భారత జోడి, ఉరుగ్వే కంటే మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఐర్లాండ్ జోడి ఫింటన్ మెక్‌కర్తీ, పౌల్ ఓ డోనోవన్ 6:23.74 నిమిషాల్లో రేసును ముగించి టాప్‌లో నిలవగా, చెక్ రిప్లబిక్‌కి చెందిన జిరి సెమానెక్, మెరోస్లావ్ రాస్తిల్ 6:28.10 టైంలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.
ఈ రెండు జట్లు సెమీఫైనల్‌కి నేరుగా అర్హత సాధించగా మిగిలిన నాలుగు స్థానాల కోసం రిపచాజ్ రౌండ్ నిర్వహిస్తారు. రోయింగ్‌లో పాల్గొంటున్న అర్జున్ లాల్ జత్, అర్వింద్ సింగ్ ఇద్దరూ కూడా భారత ఆర్మీ ఉద్యోగులు కావడం విశేషం.