రెజ్లర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం.. 72 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం..

By Srinivas M  |  First Published Jan 19, 2023, 11:14 AM IST

Wrestling Federation Of India: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, కోచ్ లు తమను లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 


భారత రెజ్లింగ్ సమాఖ్య  అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై  టీమిండియా రెజ్లర్లు లేవనెత్తిన పోరాటంపై  కేంద్ర స్పందించింది. బ్రిజ్ భూషణ్ తో పాటు జాతీయ కోచ్ లు తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ  భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ లతో పాటు భజరంగ్ పునియాలు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద   నిరసనకు దిగారు.  రెజ్లర్ల  శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది.  రెజ్లర్ల ఆరోపణలపై  మూడు రోజుల్లోగా (72 గంటలు)  వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని  ఆదేశించింది. 

ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి  ఓ ప్రకటన వెలువడింది.  ఆ ప్రకటనలో.. ‘రెజ్లర్ల శ్రేయస్సుకు సంబంధించిన అంశం కాబట్టి క్రీడా మంత్రిత్వ శాఖ  ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.  ఈ విషయంలో డబ్ల్యూఎఫ్ఐ  72 గంటల్లోగా వివరణ ఇవ్వాలి.  లేకుంటే  2011, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్  నిబంధనల ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది..’అని  పేర్కొంది. 

Latest Videos

undefined

రెజ్లర్ల నిరసనల మధ్య  ఈ నెల  18 నుంచి లక్నోలో  మొదలుకావాల్సి ఉన్న  మహిళా రెజ్లింగ్ క్యాంప్ ను సైతం రద్దు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అక్కడ ఇప్పటికే రిపోర్టు చేసిన చేసే అవకాశం ఉన్న రెజ్లర్లు   జాతీయ క్యాంప్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. 

కాగా బుధవారం  వినేశ్ పోగట్, సాక్షి మాలిక్,  భజరంగ్ పునియా వంటి  సుమారు 30 మంది రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్ పై  సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల తాను ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని  వినేశ్ సంచలన ఆరోపణలు చేసింది. 

భూషణ్ వేధింపులకు చచ్చిపోవాలనుకున్నా : వినేశ్ 

ధర్నా సందర్భంగా వినేశ్ పోగట్ స్పందిస్తూ...‘మహిళా రెజ్లర్లను   బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్ లు లైంగికంగా వేధిస్తున్నారు.  ఒలింపిక్స్ లో నా ప్రదర్శన తర్వాత నన్ను  ఎందుకూ పనికిరావని తిట్టారు.  బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల నేను మానసిక క్షోభకు గురయ్యా.  ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా.. మాకు గాయాలైతే పట్టించుకునే నాథుడే లేడు.  ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గాను నన్ను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. అంతేగాక.. ‘కోచ్‌లు మహిళా రెజ్లర్లతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫెడరేషన్ లో ఉన్న మహిళా కోచ్ లనూ ఇలాగే వేధిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ చాలా మంది  అమ్మాయిలను లైంగికంగా వేధించాడు..’ అని తెలిపింది. 

దిగేదాకా తగ్గేది లేదు.. : భజరంగ్ 

మరో రెజ్లర్ భజరంగ్ పునియా  మాట్లాడుతూ.. ‘ఫెడరేషన్ లో ఉన్నవారికెవరికీ  ఈ ఆట గురించి తెలియదు.   బ్రిజ్ భూషన్  మమ్మల్ని తిట్టేవారు.  కొట్టారు..’అని అన్నాడు.   తమ పోరాటం ప్రభుత్వం మీద కాదని.. ఫెడరేషన్,   అధ్యక్షుడి మీదేనని  ఆటగాళ్లు చెప్పారు. అతడిని పదవి నుంచి దింపేవరకూ తమ ఆందోళన విరమించబోమని  చెప్పారు. 

నిజమని తేలితే ఉరేసుకుంటా : బ్రిజ్ భూషణ్ 

అయితే తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు.   ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని తెలిపారు.   ఓ పేరు మోసిన పారిశ్రామికవేత్త  దీనికి పాత్రదారి అని ఆరోపించారు. వినేశ్ ఓడినప్పుడు  తాను ఓదార్చానని.. ఫెడరేషన్ లో మహిళలను లైంగికంగా వేధించానని నిరూపిస్తే తాను ఉరేసుకుంటానని అన్నారు.  తనపై ఈ ఆరోపణలు వస్తున్నా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని  చెప్పారు.  డబ్ల్యూఎఫ్ఐకి ఆయన  2011 నుంచి  అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 

click me!