రాణించిన తెలంగాణ అమ్మాయి.. సూపర్ సిక్స్‌కు భారత్

By Srinivas MFirst Published Jan 19, 2023, 10:37 AM IST
Highlights

ICC Women's Under-19 World Cup: ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న  మహిళల అండర్ - 19 టీ20 ప్రపంచకప్  లో  టీమిండియా సూపర్ సిక్స్ దశకు చేరింది. నిన్న స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి ఐసీసీ మహిళల అండర్ -19  టీ20 ప్రపంచకప్ లో భారత్  జైత్రయాత్ర కొనసాగుతున్నది. లీగ్ దశను భారత్  అవలీలగా దాటింది.  బుధవారం   స్కాట్లాండ్ తో జరిగిన  గ్రూప్ - ఢీ మ్యాచ్ లో  భారత్.. 85 పరుగుల తేడాతో నెగ్గింది. గత రెండు మ్యాచ్ లలో మెరుపులు మెరిపించిన  కెప్టెన్ షఫాలీ వర్మ   విఫలమైనా.. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (51 బంతుల్లో 57, 6 ఫోర్లు) భారత్ ను ఆదుకుంది.  ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి  149 పరుగులు చేసింది.  అనంతరం  స్కాట్లాండ్ ను  టీమిండియా బౌలర్లు  66  పరుగులకే ఆలౌట్ చేశారు. 

బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత్..  రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ (1) వికెట్ కోల్పోయింది. సోనియా మెంధియా (6) కూడా విఫలమైంది.  అయితే  రిచా ఘోష్ (35 బంతుల్లో 22, 3 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు  70 పరుగులు  జోడించింది. 

అయితే 17వ ఓవర్లో భారత్ కు డబుల్ స్ట్రోక్ తాకింది.  హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న  త్రిష తో పాటు రిచా కూడా  కాథరీన్ ప్రేసర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు.  చివర్లో వచ్చిన శ్వేతా సెహ్రావత్.. 10 బంతుల్లోనే  4 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లు బాది 31 పరుగులు చేసింది.  దీంతో  స్కాట్లాండ్ లక్ష్యం  150  గా  చేరింది. 

బ్యాటింగ్ లో అంతగా మెరవకపోయినా భారత బౌలర్లు రాణించారు. భారత బౌలర్లలో మన్నత్ కశ్యప్.. నాలుగు వికెట్లతో చెలరేగగా.. అర్చనా దేవి మూడు వికెట్లు తీసింది.  సోనమ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి.  స్కాంట్లాడ్ బ్యాటర్లలో డెర్సీ కార్టర్ (24) టాప్ స్కోరర్.  ఆ తర్వాత అలిసా లిస్టర్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది.  మిగిలిన  వారంతా  సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్ల ధాటికి  స్కాట్లాండ్..  66 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో  భారత్. 83 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని సూపర్ సిక్స్ దశకు చేరింది.   

 

57 off 51 deliveries by Gongadi Trisha guides to a total of 149/4 against Scotland.

Scotland innings underway.

Live - https://t.co/943cEoHGQW pic.twitter.com/1S97GsKCF0

— BCCI Women (@BCCIWomen)

స్కాట్లాండ్ కు ముందు  భారత్.. తమ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను రెండో మ్యాచ్ లో యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

click me!