
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘‘ మీ టూ ’’ సెగ భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)ని తాకింది. సీఈవో రాహుల్ జోహ్రీపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి.. బీసీసీఐ సీఈవో పదవిని చేపట్టడానికి ముందు రాహుల్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ ఆరోపించింది. తనతో పాటు ఇంకా ఎంతోమంది ఆడవారిని జోహ్రి వేధించినట్లు సదరు మహిళ తెలిపింది.
ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన పాలక కమిటీ స్పందించింది..సీఈవో పదవిని చేపట్టానికి ముందు జోహ్రి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వీటిపై ఆయనను వివరణ కోరుతామని.. దానిని బట్టి చర్యలు చేపడతామని తెలిపింది. 2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహకాధికారి పదవిని చేపట్టానికి ముందు డిస్కవరీ నెట్‌వర్క్స్‌లో ఆయన ఓ ఉన్నత హోదాలో పనిచేసేవారు.