IPL 2025, RR vs KKR: బుధవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్ గురించి చర్చ మొదలైంది.
Riyan Parag: ఒక అభిమాని తనంతట తానే మైదానంలోకి వచ్చి రియాన్ పరాగ్ (Riyan Parag) పాదాలకు నమస్కారం చేశాడా, లేక తన పబ్లిసిటీ కోసం ఐపీఎల్‌లో (IPL 2025) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ డబ్బులిచ్చాడా? దీనిపై ఇప్పుడు అంతర్జాలంలో పెద్ద చర్చే నడుస్తోంది. మైదానంలోకి వచ్చి పరాగ్ కాళ్లకు దండం పెట్టిన యువకుడికి రూ.10,000 ముందే ఇచ్చారని చాలామంది సామాజిక మాధ్యమాల్లో అంటున్నారు. గత శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) జరిగిన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఒక ప్రేక్షకుడు మైదానంలోకి వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పాదాలకు నమస్కారం చేశాడు. ఆ సంఘటన చూసిన తర్వాత తన పబ్లిసిటీ కోసం డబ్బులిచ్చి ఓ కుర్రాడితో పరాగ్ ఇలా చేయించాడని చాలామంది అంటున్నారు. అయితే ఆ యువకుడు తనంతట తానే మైదానంలోకి వచ్చి పరాగ్‌కు నమస్కారం చేశాడని ఇంకొందరు వాదిస్తున్నారు.
గౌహతిలో పరాగ్ చుట్టూ సందడి
పరాగ్ సొంత ఊరు గౌహతి. అతని వల్లనే చాలామంది అస్సాం క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు మద్దతు ఇస్తారు. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండో హోమ్ గ్రౌండ్ బర్సపారా క్రికెట్ స్టేడియం. బుధవారం ఈ స్టేడియంలో ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు పరాగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను టాస్ వేయడానికి వెళ్లగానే స్థానిక క్రికెట్ అభిమానులు సంతోషించారు. అభిమానులకు పరాగ్ అభివాదం చేశాడు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ అభిమానికి డబ్బులిచ్చారని, స్వయంగా అతడే చెప్పాడని రియాగ్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదుగానీ రియాన్ పరాగ్ అయితే వివాదంలో ఇరుక్కున్నాడు.