మ్యాచ్ ఫిక్సింగ్.. క్రికెటర్ కి నోటీసులు

First Published Jun 25, 2018, 1:56 PM IST
Highlights

రూ.1.3కోట్లు ఆఫర్ చేసిన బుకీలు

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు గాను పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కి ఆ దేశ క్రికెట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో ఆడిన మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడాలంటూ బుకీలు  తనను కలిశారని అక్మల్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై  విచారణలో పాల్గొనాల్సిందిగా పాక్ క్రికెట్ బోర్డు అక్మల్ ని ఆదేశించింది.

‘2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3కోట్లు ఇస్తామన్నారు. అంతకుముందు కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటిని తిరస్కరించా. మరోసారి ఇలాంటి ఉద్దేశాలతో నా దగ్గరకు రావొద్దని వాళ్లకు గట్టిగా చెప్పా’అని అక్మల్‌ ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అక్మల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎవరైనా బుకీలు ఆటగాళ్లను సంప్రదిస్తే నిబంధనల ప్రకారం వారు వెంటనే బోర్డుకు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాలి. కానీ అక్మల్‌ తనను బుకీలు సంప్రదించినట్లు అధికారులకు ఇప్పటి వరకూ చెప్పలేదు. తాజాగా టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 27లోగా అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

మరోపక్క అక్మల్‌ వ్యాఖ్యలపై ఐసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఆ మ్యాచ్‌లో ఏమైనా ఫిక్సింగ్‌ జరిగిందా? అన్న దానిపై విచారణ చేపడతామని ఐసీసీ తెలిపింది.

click me!