Rohan Bopanna Retirement: పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ టెన్నిస్ తొలి రౌండ్ లో నాకౌట్ అయిన తర్వాత భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న మాట్లాడుతూ .. 'ఇది కచ్చితంగా దేశం కోసం నా చివరి ఈవెంట్ అవుతుందని' అన్నాడు.
Rohan Bopanna Retirement: పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ అండర్ లైట్స్‌లో రోహన్ బోపన్న-ఎన్ శ్రీరామ్ బాలాజీ జోడీ ఫ్రెంచ్ ద్వయం ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్-గేల్ మోన్‌ఫిల్స్ చేతిలో ఓడిపోయారు. తొలి రౌండ్ లోనే ఈ జోడీ ఒలింపిక్స్ నుంచి ఔట్ అయింది. దీని తర్వాత భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. "ఇది ఖచ్చితంగా భారత్ తరఫున నా చివరి ఈవెంట్‌గా నిలిచిపోతుంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నేను టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదించబోతున్నాను" అని బోపన్న చెప్పాడు.
కాగా, 1996లో అట్లాంటా గేమ్స్‌లో లియాండర్ పేస్ చారిత్రాత్మక సింగిల్స్ కాంస్య పతకాన్ని సాధించిన తర్వాత నుంచి ఒలింపిక్ పతకం భారత టెన్నిస్‌కు దూరమైంది. బోపన్న 2016లో జిన్క్స్‌ను బద్దలు కొట్టడానికి దగ్గరగా వచ్చాడు కానీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సానియా మీర్జాతో కలిసి నాల్గవ స్థానంలో సరిపెట్టాడు. అతను ఇప్పటికే డేవిస్ కప్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. "నేను ఉన్న ప్రదేశానికి ఇది ఇప్పటికే పెద్ద బోనస్. రెండు దశాబ్దాలుగా నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా అరంగేట్రం జరిగిన 22 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను" అని ఆనందంతో చెప్పాడు.
undefined
రోహన్ బోపన్న టెన్నిస్ కెరీర్ సాగింది ఇలా..
2002 నుండి భారత్ తరఫున డేవిస్ కప్ జట్టు సభ్యుడుగా రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఆరు ఏటీఎఫ్ మాస్టర్స్ 1000 టైటిళ్లను గెలుచుకున్నాడు. 40 ఏళ్ల వయసులో ఇంకా సత్తా చాటుతున్న ఈ వెటరన్ 2012, 2016 ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 19 ఏళ్ల వయస్సులో టెన్నిస్‌లో కెరీర్ మొదలు పెట్టిన ఈ స్టార్ ప్లేయర్ 2007 హాప్‌మన్ కప్‌లో సానియా మీర్జాతో కలిసి మెరుగైన మిక్స్‌డ్ డబుల్స్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడ ఈ జోడీ రన్నరప్‌గా నిలిచింది. అదే సంవత్సరం బోపన్న మొదటిసారిగా 2007లో పాకిస్థాన్‌కు చెందిన ఐసమ్-ఉల్-హక్ ఖురేషీతో భాగస్వామి అయ్యాడు. ఇద్దరు అనేక విజయాలు అందుకున్నారు. 2010 వరకు "ఇండో-పాక్ ఎక్స్‌ప్రెస్"గా ప్రసిద్ధి చెందిన ఈ జంట తన పూర్తి అధిపత్యంతో దూసుకుపోవడం ప్రారంభించింది. వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు, యూఎస్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది.
2012లో బోపన్న ఒలింపిక్స్‌కు ముందు భారత మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతితో జట్టుకట్టాలని నిర్ణయించుకున్నాడు. లండన్ 2012 లో భారత జోడీ రెండవ రౌండ్‌ను దాటలేకపోయినప్పటికీ, కొన్ని నెలల తర్వాత పారిస్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. నాలుగు సంవత్సరాల తర్వాత రియో 2016లో, బోపన్న మిక్స్‌డ్ డబుల్స్ పోటీలో సానియా మీర్జాతో కలిసి ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు చాలా దగ్గరగా వచ్చాడు. 2017లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్స్కీతో పాటు, బోపన్న రోలాండ్ గారోస్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఘనతను సాధించిన నాల్గవ భారతీయుడు.
2018 ఆసియా గేమ్స్‌లో పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్‌తో కలిసి బోపన్న బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే, సానియా మీర్జాతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఇండియన్ వెల్స్ డబుల్స్ ఈవెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ళ వయసులో రోహన్ బోపన్న ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2024 మియామి ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో బోపన్న ఎబ్డెన్‌తో కలిసి పురుషుల డబుల్స్ ను గెలుచుకున్నాడు. ఓపెన్ ఎరా టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. అలాగే, డబుల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు రికార్డు సృష్టించాడు.
8 సార్లు ఛాంపియన్ కానీ.. భారత్‌ను ఫైనల్‌లో ఓడించిన శ్రీలంక