
French Open 2022: ఓ పురుష ఆటగాడు క్రీజులో దిగాలంటే... ఫిట్‌గా ఉంటే సరిపోతుంది. అదే క్రీడాకారిణి అయితే ఫిట్‌నెస్‌తో పాటు అనేక శారీరక సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. అందులో బహిష్టు సమస్య ఒకటి. నెలకోసారి ప్రతీ మహిళను శారీరకంగా, మానసికంగా వేధించే ఈ సమస్య... ఓ టెన్నిస్ క్రీడాకారిణి కలను నాశనం చేసింది.
19 ఏళ్ల చైనా టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్‌వెన్, టెన్నిస్ ప్రపంచంలో సంచలన విజయాలతో ధృవ తారగా ఎదుగుతోంది. చైనాలో కరోనా వైరస్ సృష్టించిన కలకలానికి తోడు పెంగ్ సూయి స్కాండల్ కారణంగా రెండేళ్లుగా అక్కడ క్రీడా ప్రపంచం స్థంభించిపోయింది...
ఆరేళ్ల వయసులో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలంటే ఇష్టపడిన జెంగ్ క్విన్‌వెన్, ఆ తర్వాత టెన్నిస్‌లోనే కెరీర్ వెతుక్కోవాలని డిసైడ్ అయ్యింది. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటని ఎంతగానో ఇష్టపడే జెంగ్ క్విన్‌వెన్, 2021 నుంచి 79 మ్యాచుల్లో పాల్గొంటే 60 మ్యాచుల్లో విజయాలు అందుకుంది...
అతి తక్కువ సమయంలో టాప్ 100లోకి ఎంట్రీ ఇచ్చిన జెంగ్ క్విన్‌వెన్, వరల్డ్ నెం.74 ర్యాంకుతో ఫ్రెంచ్ ఓపెన్ 2022 సీజన్ బరిలో దిగింది. మూడో రౌండ్‌లో 2018 ఛాంపియన్ సిమోనా హలెప్‌ని ఓడించిన జెంగ్ క్విన్‌వెన్, నాలుగో రౌండ్‌లో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ టోర్నీ మధ్యలోనే నిష్కమించింది...
వరల్డ్ నెం.1 ఇగా స్వియాటెక్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-7 (5/7), 6-0, 6-2 తేడాతో ఓడింది జెంగ్ క్విన్‌వెన్. మొదటి సెట్‌లో వరల్డ్ నెం.1 ని మట్టికరిపించిన జెంగ్ క్విన్‌వెప్, రెండో రౌండ్ ఆరంభంలోనే పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్య సాయం కోరింది...
‘ఇది ఆడాళ్ల సమస్య. ఇదే మొదటి రోజు, చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ రోజు నేను ఆడాలి. ఓ ఆడదానిగా నా లక్షణాన్ని నేను తప్పించుకోలేను. నేను మగాడిగా పుట్టి ఉంటే బాగుండేది... ఈ కష్టాలు, నొప్పిని భరించాల్సిన అవసరం ఉండేది కాదు.. ఇది చాలా చాలా కష్టంగా ఉంది... ’ అంటూ కామెంట్ చేసింది జెంగ్ క్విన్‌వెప్...
నొప్పిని భరిస్తూ, ఆటను కొనసాగించిన జెంగ్ క్విన్‌వెప్, ఏకంగా 46 తప్పులు చేసి మ్యాచ్‌ని చేజార్చుకుంది. పొత్తి కడుపు నొప్పి కారణంగా సరిగా బ్యాలెన్స్ చేయలేక ఆమె కాలికి కూడా గాయమైంది.
‘ఈ నొప్పి లేకపోతే నేను ఇంకా బాగా ఆడేదాన్ని, ఇంకా బాగా పరుగెత్తేదాన్ని... ఇంకా గట్టిగా కొట్టేదాన్ని. ఇంకోసారి ఆమెతో మ్యాచ్ ఆడాలని ఉంది. అయితే అప్పుడు నేను పర్ఫెక్ట్ షేప్‌లో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేసింది 19 ఏళ్ల చైనీస్ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్‌వెప్...
ఏప్రిల్ 23 నుంచి ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇగా స్వియాటెక్, తొలి సెట్‌లో ఓడిపోవడం కూడా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి.
‘జెంగ్ చాలా అద్భుతంగా ఆడింది. ఆమె కొన్ని షాట్లు చూసి ఆశ్చర్యపోయా. ఆమె స్పిన్ టెక్నిక్ చాలా బాగుంది. ఓడినా ఆమె ఆటకు అభినందనలు తెలపాల్సింది. మొదటి సెట్ ఓడిన తర్వాత కూడా కమ్‌బ్యాక్ ఇవ్వడం సంతోషాన్నిచ్చింది. అయితే ఆమె ఈ సమస్యతో బాధపడుతూ ఆడిందని తెలిసి షాక్ అయ్యా.. ’ అంటూ కామెంట్ చేసింది పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్...