
హైదరాబాద్: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టికెట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా వాటి వెంటే పడుతుంది. ఫ్యాన్స్‌లో ఉన్న ఈ రేంజ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు, కొందరు వ్యక్తులు యాప్‌లను రంగంలోకి దించారు. ఫ్యాన్స్ ఈ యాప్‌లను తమ స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. టికెట్స్ కోసం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అదెలాగో చూద్దాం.
ఫిఫా తన వెబ్‌సైట్‌లో ఫ్యాన్స్ కోసం టికెట్లు ఉంచుతుంది. ఉదాహరణకు 25 లక్షల టికెట్లను అలాట్ చేసిందనుకుంటే.. అలా పెట్టిన వెంటనే యమా స్పీడుగా టికెట్ సేల్స్ జరిగిపోతాయి. నిముషాల వ్యవధిలో ఖాళీ అయిపోతాయి. విషయం తెలుసుకొని వెబ్‌సైట్‌లోకి ఎంటరయ్యేసరికి సోల్డ్ అవుట్ అన్న బోర్డు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
సరిగ్గా ఈ వీక్‌పాయింట్‌నే తాజా యాప్‌లు వెరైటీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఫిఫా అప్పుడప్పుడు ఫ్యాన్స్ రిటర్న్ చేసిన టికెట్లు కూడా సేల్‌కు పెడుతుంటుంది. అలా అప్పుడప్పుడు కొన్ని టికెట్లను అందుబాటులో ఉంచుతుంటుంది.
సాధారణంగా అర్థరాత్రి దాటాక ఒంటి గంట నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల దాకా టికెట్లను వెబ్‌సైట్‌లో సేల్‌కు పెడుతుంది. కానీ ఫిఫా టికెటింగ్ సిస్టమ్ బాగా టైమ్ తినేస్తుంది. టికెట్ దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. ఉదాహరణకు శనివారం అర్థరాత్రి దాటాక ఒకటిన్నరకు టికెట్లు డంప్ చేసినట్టు ఫిఫా వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేసిన తర్వాత ఉదయం ఐదున్నరప్పుడు మాత్రమే లాగిన్ సాధ్యపడుతుంది. మన ఇండియన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే... రైలులో తత్కాల్ టికెట్ కొనడానికి ట్రై చేసినట్టు అన్నమాట.
ఈ వెయిటింగ్‌తో పని లేకుండా లేటెస్ట్ యాప్‌లు యూజర్లకు ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నాయి. అలా టికెట్లు పెట్టిన మరుక్షణం ఈ యాప్‌లను తమ యూజర్లకు స్టేటస్ మారింది అంటూ ఒక పుష్ నోటిఫికేషన్ పంపుతాయి. దాంట్లో సదరు యూజర్లు వెంటనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి టికెట్లు దొరకపుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. మిగతావాళ్ళు వచ్చి వెబ్‌సైట్‌లోకి వచ్చి చెక్ చేసుకునేలోగా యాప్ యూజర్లు టికెట్లు బుక్ చేసేసుకుంటారు. కానీ ఈ యాప్‌లు ఫ్రీగా సర్వీస్ అందించవు. ఇండియాలో అయితే రూ.330 పే చేస్తేనే పనిచేస్తాయి. అదే అమెరికాలో అయితే ఐదు డాలర్లు కట్టాలి.