
ప్రస్తుత క్రికెట్ శకంలో వినోదాన్ని పంచే క్రికెటర్లు కరువయ్యారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవీన్ పీటర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు క్రికెట్ అంటనే ఎంటర్ టైన్ మెంట్. అలాంటి ఎంటర్ టైన్ మెంట్ రోజు రోజుకీ తగ్గిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం తనను ఎక్కువగా కలవర పరుస్తుందన్నాడు. అసలు సిసలైన ఆట క్రికెటర్లలో కనిపించడం లేదని పెదవి విరిచాడు. కాకపోతే ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మినహాయింపు ఇచ్చాడు.
‘ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లిని మినహాయిస్తే క్రికెట్‌లో నిజమైన వినోదాన్ని పంచేవారు కానీ, సూపర్ స్టార్లు కానీ కనిపించడమే లేదు. ఈ విషయం నన్ను ఆందోళన పరుస్తోంది. ఒకప్పటి సూపర్ స్టార్లు ముత్తయ్య మురళీధరన్, ఆంబ్రోస్, వాల్ష్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, వసీమ్ అక్రమ్‌లు అత్యంత వినోదాన్ని అందించిన క్రికెటర్లు. ఇప్పుడు ఆ తరహా ఆట కనిపించడం లేదు’ అని ఓ మీడియా సంస్థతో పీటర్సన్ పేర్కొన్నారు.