ధోనీని హీరోని చేసిన రోజు.. ఇవాళ ప్రత్యేకత గుర్తుందా..?

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 12:48 PM IST
Highlights

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా.. మిస్టర్ కూల్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోనీ. ఒక సాధారణ క్రికెటర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం అత్యుత్తమ సారథిగా నిలబడటానికి బీజం పడిన రోజు.. ఈ రోజే

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా.. మిస్టర్ కూల్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోనీ. ఒక సాధారణ క్రికెటర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం అత్యుత్తమ సారథిగా నిలబడటానికి బీజం పడిన రోజు.. ఈ రోజే.. భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని నేటికి సరిగ్గా 11 ఏళ్లు.

సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లీ లాంటి దిగ్గజాలు వరుసగా జట్టుకు దూరమవుతున్న దశలో.. వరుస పరాజయాలు వెక్కిరిస్తున్న సమయంలో భారత్ టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టింది. పైగా టీ20లు ఆడిన అనుభవం కూడా లేదు. అయినప్పటికీ భారత్ అసాధరణ ప్రదర్శన చేసింది.

గ్రూప్ దశలో ఒక్కో జట్టును ఓడిస్తూ... సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టకరిపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాక్ జట్టు చివరి ఓవరకు పోరాడి ఓడింది.

పరాజయానికి దగ్గరగా వచ్చినప్పటికీ.. మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చిన వారికే బంతిని అప్పగించి ఫలితాలు రాబట్టాడు ధోనీ. ఫైనల్ ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జోగిందర్ సింగ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని నాటి పాక్ కెప్టెన్ మిస్బా సిక్స్‌గా మలిచాడు.

అనంతరం తర్వాతి బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా స్విప్ చేయడంతో అక్కడే ఉన్న శ్రీశాంత్ బంతిని అందుకోవడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో ధోనీ పేరు క్రికెట్ ప్రపంచంలో మారు మోగిపోయింది. 1983 తర్వాత భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడటానికి 24 సంవత్సరాలు పట్టింది. 

click me!