తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకరణలు, సేవల కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వాడతారు. అయితే, భక్తులు మాత్రం పూలు పెట్టుకోకూడదనే నిబంధన ఉంది. పూలు పెట్టుకున్న మహిళలను స్వామివారి దర్శనానికి కూడా అనుమతించరు.
సాధారణంగా భక్తులు సంప్రదాయ వస్త్ర ధారణలో ఆలయాలకు వెళ్తారు. ప్రత్యేకించి మహిళలైతే సంప్రదాయ వస్త్రాలు ధరించి.. నుదిటిపై కుంకుమ, తలలో పూలు పెట్టుకుంటారు. ఆలయాలకు వెళ్లేవారిని ఇలాగే చూస్తుంటాం. అయితే, కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టుకోరు. ఎందుకో తెలుసా....
undefined
ఇల వైకుంఠం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రాన్ని ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో అయితే లక్షల్లోనే తిరుమలకు చేరుకుంటారు. రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటారు.
ఇలా తిరుమలలో నిత్యం కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్లే ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్యం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు అందుకుంటారు. వివిధ అలంకారాల్లో భక్తకోటికి దర్శనమిస్తారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడు, విష్ణువుని అలంకార ప్రియుడని పిలుస్తారు. అలాగే, శ్రీహరిని పుష్పాలంకార ప్రియుడని అంటారు.
పురాణాల ప్రకారం.. శ్రీరంగం భోగమండపం, కంచి త్యాగ మండపం అని చెబుతారు. అదే విధంగా తిరుమలను పుష్ప మండపంగా పురాణాలు పేర్కొంటాయి. తిరుమల పుష్ప మండపం కావడం, శ్రీవారు పుష్పాలంకార ప్రియుడు కావడం వల్ల నిత్యం టన్నుల కొద్దీ పూలతో స్వామివారికి అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే వందల రకాల అలంకరిస్తారు. టన్నుల కొద్దీ పుష్పాలతో పుష్పయాగం జరిపిస్తారు.
అందుకే తిరుమలలో పూసే ప్రతి పువ్వూ శ్రీవారి కోసమే పూస్తుందని అక్కడి ప్రజలు, భక్తులు నమ్ముతారు. అందుకే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలు పెట్టుకోకుండా వెళ్లాలనే నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అమలు చేస్తుంది. నిత్యం మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. పొరపాటున తెలియనివారు ఎవరైనా పూలు పెట్టుకుని వెళ్తే చెక్ పోస్టుల్లో గానీ, క్యూలైన్లలోగానీ తీయించి వేస్తారు. ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.