స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత

By telugu news teamFirst Published Mar 12, 2021, 11:33 AM IST
Highlights

ఇతరులు మీపై విధించినవన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మిక బానిసత్వంలో బంధించేందుకు వేసిన సంకెళ్ళే. వాటి నుంచి విముక్తి కలిగించి మిమ్మల్నిస్వేచ్ఛా విహారిగా చేసేదే ధ్యానం. అప్పుడే మీరు మళ్ళీ అస్తిత్వపు నీడలో నక్షత్రాల వాడలో హాయిగా విహరించగలరు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

అడ్డంకులను అధిగమించే సోపానాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇలా అనేక రకాల స్వేచ్ఛలున్నాయి. కానీ అవన్నీ పైపైవి మాత్రమే. అసలైన స్వేచ్ఛకు పూర్తి భిన్నమైన పార్శ్వముంటుంది. అది ఏ మాత్రం బయట ప్రపంచానికి సంబంధించినది కాదు. అది మీలో ఉదయిస్తుంది. అన్నిరకాల నిబద్ధీకరణలు, ధార్మిక సిద్ధాంతాలు, రాజకీయ వేదాంతాలనుంచి బయటపడేదే అసలైన ‘స్వేచ్ఛ.’

ఇతరులు మీపై విధించినవన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మిక బానిసత్వంలో బంధించేందుకు వేసిన సంకెళ్ళే. వాటి నుంచి విముక్తి కలిగించి మిమ్మల్నిస్వేచ్ఛా విహారిగా చేసేదే ధ్యానం. అప్పుడే మీరు మళ్ళీ అస్తిత్వపు నీడలో నక్షత్రాల వాడలో హాయిగా విహరించగలరు. ఎప్పుడైతే మీరు అస్తిత్వానికి అందుబాటులో ఉంటారో అప్పుడు అస్తిత్వం మీకు అందుబాటులోకి వస్తుంది. మీ ఇద్దరి కలయికే పరమానందానికి పరాకాష్ట. అది కేవలం స్వేచ్ఛలో మాత్రమే జరుగుతుంది. అందుకే స్వేచ్ఛ అత్యంత విలువైనది. అంతకన్నా విలువైనది ఏదీ లేదు.

‘‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’ తరతరాలుగా మానవాళిని వెంటాడుతున్న శాశ్వతమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ‘‘బాధ్యత లేకపోవడమే స్వేచ్ఛ’’అని మీరు అనుకుంటున్నారు. కానీ మొత్తం బాధ్యత మీపై పడుతుంది.  ‘ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. పాప చింతనలు, అవినీతి విత్తనాలు మొదటి నుంచి నువ్వే నాలో నాటావు. నువ్వే నన్ను అలా తయారుచేశావు. కాబట్టి అన్నింటికీ బాధ్యత నీదేకానీ నాది కాదు. నేనొక చిన్న జీవాన్ని. నువ్వు సృష్టికర్తవు. కాబట్టి బాధ్యత నాదెలా అవుతుంది?’’ అంటూ మన బాధ్యతను భగవంతునిపైకి నెట్టేస్తారు. 

నిజంగా దేవుడు ఉన్నట్లైతే మీరన్నట్లు మీ బాధ్యతను ఆయన పంచుకోక తప్పదు. ఒకవేళ ఆయన లేకపోతే ఎవరు చేసే పనులకు వారే బాధ్యులవుతారు. ఎందుకంటే మీ బాధ్యతలను మరొకరిపై వేసేందుకు వేరే దారిలేదు. మీరు స్వేచ్ఛగా ఉండండని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరు చేసే పని పట్ల బాధ్యతాయుతంగా ఉండండి’’ అని. ఎందుకంటే, ఆ పని చేసేది మీరే కాబట్టి, దాని బాధ్యత కూడా మీదే అవుతుంది. అంతేకానీ ఆ బాధ్యతను మీరు ఇతరులపై వెయ్యలేరు.

మీరు ఏ పనిచేసినా దాని బాధ్యత కూడా మీదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా మీ చేత ఆ పని చేయించారని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో వద్దో నిర్ణయించేది మీరే. స్వేచ్ఛతోపాటే బాధ్యత కూడా వస్తుంది. నిజానికి స్వేచ్ఛే బాధ్యత. కానీ మనసు మహామోసకారి. అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది కానీ సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు.
 

click me!