శివరాత్రి నిర్ణయం - విధులు

By telugu news teamFirst Published Mar 11, 2021, 10:00 AM IST
Highlights

అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
    
మన పండగలన్ని తిధులతోను, నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాసశివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివున్ని కొలుస్తారు. సూర్యాస్తమ సమయమునకు పరమందు 6 ఘడియలను ప్రదోషకాలమంటారు. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్రగ్రంధాలు తెలుపుతున్నాయి.

అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం. కాబట్టి  శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు. మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు.

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి...
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య మాట మాట పెరిగి తమలో ఎవరు గొప్పో అని తేల్చుకోవలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ, విష్ణువులు  లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది, అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు.

వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది, తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గోప్ప అనే పోటితో వాదనతో ఉన్నదానిని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆరోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.

శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవిధులు:- మహాశివరాత్రి రోజు బ్రహ్మీమూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకుని రక రకాల పూలతో అలంకరించుకోవాలి. లింగకారంలో ఉన్న శివునికి జలంతో, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మిపూలను, గోగుపూలు, తెల్లని, పచ్చని పూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించాలి. తాంభూలం, అరటి పండు, జామపండు, ఖర్జరపండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి దేవున్ని మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన  అష్టైశ్వర్యాలు ,సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే అభిషేక ప్రియుడు అంటారు. భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివునికి బోళాశంకరుడని పేరు. పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు.

ముఖ్యంగా మహాశివరాత్రి అంటేనే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏరోజైతే చేస్తారో అదే రోజు మహాశివరాత్రిగా జరుపుకోవడం మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. పూర్వ సిద్ధాంతం ప్రకారం శ్రీ శైలంలో 11 వ తేది గురువారం రోజు శివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ( సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలములోని  చెల్లాపూర్ గ్రామంలో స్వయంభూవుగా వెలసిన సోమేశ్వరాలయంలో కూడా గురువారమే నిర్వహిస్తున్నారు ) 

మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోర్కేలను నెరవేరుస్తాడు. ఈ మహా శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంత జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి తను తినే కంటే ముందే ఆవునకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి గోమాతకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆతర్వాత పేద వారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి, పశు, పక్ష్యాదులకు కూడా ఏదైన అవి తినే ఆహార పదార్ధాలు వాటికి తినిపించాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణగావించినచో విశేషించి పుణ్యప్రదం తోపాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పోందుతారు.

ముఖ్యంగా తనకు ఉన్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవత్ అనుగ్రహం వలన మనకున్న సంపదలో లోకకళ్యాణార్ధం మనవంతుగా కర్తవ్య భాద్యతను చేపడితే, ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు. సాక్షాత్తు పరమ శివుడు తన భక్తుల భాదలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ... తమ భక్తులు చేసే ధానాలను ఏ రూపంలోనైనవచ్చి బిక్షతీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మమైన పరమార్ధమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమౌతాము.

ముఖ్యంగా మీ మీ ప్రాంతాలలో శివాలయాలో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం. ముఖ్యంగా తెలుగు రాష్టాలలో శ్రీరామ నవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రమంతట శ్రీరామ నవమి వేడుకలు చేసుకోవడం.. అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆరోజే ప్రజలందరు మహా శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగ సాంప్రదాయంగా వస్తుతున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం. భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంత శివాలయాలను అనుసరించడం సర్వోత్తమమం.

     


 

click me!