సాధనంబున సమకూరు సంపదల్

By telugu news teamFirst Published Jun 14, 2020, 7:15 AM IST
Highlights

మానసిక పవిత్రతను సాధించే దిశగా సాగే నైతిక నియమావళిని పతంజలి మహర్షి రెండు భాగాలుగా విభజించారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

హృదయం లేని మనిషి ఉండరు. శారీరక శుభ్రత కన్నా మానసిక పరిశుద్ధత కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన హృదయమే ఆధ్యాత్మికతకు మూలం. నోటికి అందే భోజనం మాత్రమే కాదు, ఇంద్రియాల ద్వారా మనసుకు అందే విషయాల్లోనూ ఎటువంటి కల్మషం లేకుండా చూసుకోవాలి.

పవిత్ర హృదయం జ్ఞాన, భక్తి , రాజ యోగాల్లో నైతికత అవసరమని కర్మయోగంలో అంత ఆవశ్యకం కాదని కొందరు భావిస్తారు. ఇంద్రియ నిగ్రహం, అహింస, సత్యసంధత, అస్తేయం (ఇతరుల వస్తువులను కోరుకొనకపోవడం) అశత్రుత్వం ( శత్రువు అన్న భావన లేకపోవడం )- ఈ గుణాలు కర్మయోగ సాధనకు అత్యంత ముఖ్యమని జ్ఞానులు చెబుతారు. ఇవేమీ పాటించకపోతే చేసేది కర్మయోగం కాదు... కర్మ అవుతుంది.

మానసిక పవిత్రతను సాధించే దిశగా సాగే నైతిక నియమావళిని పతంజలి మహర్షి రెండు భాగాలుగా విభజించారు. 

* ఒకటి - యమ ( సాధారణం ) 

* రెండోది- నియమ ( నిర్దిష్టమైనది ).

యమం :- యమలో 1. అహింస, 2. బ్రహ్మచర్యం, 3. సత్యపాలన, 4. అస్తేయం, 5. అపరిగ్రహం ( ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడం ) అనే అయిదు నీతి సూత్రాలు ఉంటాయి.


నియమ :- నియమ కూడా అయిదు నీతి సూత్రాలు కలిగి ఉంది. అవి... 1. శౌచం - శరీరం, 2. మనసు పవిత్రంగా ఉండటం. 
              3. తపస్సు- ఇంద్రియ నిగ్రహం. 4. స్వాధ్యాయం- సత్‌ గ్రంథపఠనం. 5. ఈశ్వర ప్రణిధానం- శరణాగతి.

మనం వస్తుమయ ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటి ఆకర్షణలకు లోబడకూడదు. భగవంతుడి మీద మనసుపెట్టి వీలైనంత స్వచ్ఛంగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనికి అనుబంధ భాషణంగా ‘పడవ నీటిలో ఉండొచ్చుగాని, నీరు పడవలో ఉండకూడదు కదా’ అంటారు శ్రీరామకృష్ణులు.

సహజంగా మనం మన శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తాం. అలాకాక ప్రతిరోజూ ఇతరుల మంచి కోసం ప్రార్థన చేయడం ఉత్తమ లక్షణమని మహోన్నత స్వభావులంటారు. ధ్యానానికి కూర్చోగానే ‘సర్వప్రాణులకు, నాలుగు దిక్కులకు ప్రేమతో నిండిన ఆకాంక్షను వెదజల్లాలి’ అంటారు వివేకానందస్వామి. ఇది మనోనైర్మల్యానికి ప్రతీక.

మురికి నీరు మురికిని తొలగించలేదు. నిత్యం అపవిత్ర భావాలతో అలరారే వ్యక్తి , మనో పవిత్రతను ఎన్నటికీ పొందలేడు. నిరంతరం ‘పవిత్రత నా జన్మహక్కు, నా నిజతత్త్వం, నా సహజ ప్రవృత్తి, నేను పరిశుద్ధుణ్ని, ఆనందమయుణ్ని’ అన్న భావపరంపరతో కొనసాగడం- హృదయ స్వచ్ఛతను సూచిస్తుంది, పోను పోను సాధిస్తుంది.

హృదయ పవిత్రతలో పరిణతి సాధించిన వ్యక్తి అజాత శత్రువు. అడుగు పెట్టిన చోటల్లా గౌరవాభిమానాలు పొందుతాడు. అతడి సమక్షాన్ని అందరూ కోరుకుంటారు. సామీప్యాన్ని అనుభూతించడానికి ఉవ్విళ్లూరుతారు. పునీత భావనలు కలిగిన మహనీయుల కూడికతో జన సమూహం సత్సంగం స్థాయికి చేరుతుంది. మనసుకు అంటిన మలినాలు ప్రక్షాళన అయినవారంతా ధవళ వర్ణ తేజస్సుతో వెలుగొందుతారు.

దీపాల్లో కొద్ది సేపటిలో వెలిగేవి కొన్ని ఉంటాయి. అఖండ దీపంగా నిలిచి నలువైపులా వెలుగులు చిందిస్తూ నిరంతరం తిమిర సంహారం చేసేవి మరి కొన్ని ఉంటాయి.

మనిషిగా పుట్టి నిత్య చైతన్య దీపంలా దేదీప్యమానంగా వెలుగొందుతూ అంతర్యామిలో అంతర్లీనం కావడమే ముక్తి. అందుకు హృదయ పవిత్రత ఎంతగానో దోహదం చేస్తుంది. సాధన వలన సమకూరు సంపదలు అన్నారు పెద్దలు. అవి మన అనుభవం లోకి రావాలంటే వాటి గురించి తెలుసుకోవాలంటే మొదట అలవాటు పడాలి....సాధనతో సాదించాలి. అపుడే ఏదైనా సిద్ధిస్తుంది.


 

click me!