శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన దినం

By Ramya news team  |  First Published Jan 24, 2022, 10:42 AM IST

ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు...1903 సంవత్సరం వచ్చే సరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. 


త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు.. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు... ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి  నాడు జరుగుతుంది... ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు.

చరిత్ర :- ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాలకన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించాడు. మరణానికి కొద్ది రోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారాడు.. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

Latest Videos

undefined

ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు...1903 సంవత్సరం వచ్చే సరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు, అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు, ప్రతి సంవత్సరం ఆయన వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు.

మరుసటి సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని  ఉద్ధండులంతా ఆయన వర్ధంతి రోజు తిరువయ్యూరులోనే జరపాలనీ, వారందరూ కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికగా ఎంచుకోవాలనుకున్నారు. 1905లో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్దఎత్తున అన్నదానం, వేద సంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా నిలిస్తే, తిలైస్థానం నరసింహ భాగవతార్, తిలైస్థానం పంజు భాగవతార్లు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా ఉన్నారు.
 
అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరూ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరూ సమాంతరంగా ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరో పక్క చేరి రెండు వైరి వర్గాలుగా విడిపోయారు.పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి (పెద్ద బృందం) చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి (చిన్న బృందం) గా పేరు పెట్టుకున్నారు. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మలైకోట్టై గోవిందసామి పిళ్ళై ఆధీనంలోకి చిన్న కచ్చి ప్రముఖ హరికథా కళాకారుడు శూలమంగళం వైద్యనాథ భాగవతార్ ఆధీనంలోకి వచ్చింది. 

నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు ఐదు రోజుల ముందు ప్రారంభమై ఆరాధన రోజున ముగిసే లాగా పెద్ద కచ్చి ఆరాధనరోజు ప్రారంభమై తరువాత నాలుగు రోజలపాటు సాగే సాంప్రదాయం మొదలైంది. రెండు వర్గాలు సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు, పేదలకు అన్నదానం చేసేవారు. 
ఆ తొమ్మిది రోజులు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేది, కొద్ది రోజులకు రెండు వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్ళను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు, దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవరూ బహిరంగంగా పాడటానికి , నృత్యం చేయడానికి ఒప్పుకునే వారు కాదు. రెండు వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలలోకి అనుమతించేవారు కాదు.

అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసీగా ఉండేది, అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది, త్యాగరాజుకు సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేది. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో ఆమెకు వయసు మీరింది, పిల్లలు కూడా లేరు, ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేసింది.
 
1925 లో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదనీ మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. 

రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలుగజేసుకోలేదు కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి కనీసం హరికథ చెప్పడానికి ఒప్పుకోలేదు. త్యాగరాజు తన పాటలలో అక్కడక్కడా మహిళపై చేసిన ఆరోపణలను అందుకు కారణంగా చూపించారు... కానీ నాగరత్నమ్మ వాటన్నింటికీ బెదరక మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనుకలే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ చాలామంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు, దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోకి నిషేధించాలనీ ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని కోర్టుకు ఎక్కింది. ఆమె కేసు ఓడిపోయింది, కానీ కోర్టు మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకుని నిర్వహించుకోమని తెలిపింది.

ఈ సాంప్రదాయం 1940 వరకు అలాగే కొనసాగింది. 1941 యస్.వై కృష్ణస్వామి అన్ని వర్గాలవారిని ఏకం చేశాడు, అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన సంప్రదాయం మొదలైంది... హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్నకీర్తనలను బృంద గానానికి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నాడు. అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్నకీర్తనలను ఆలపించడం సాంప్రదాయంగా మారింది. 1941 కు మందు మూడు వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికిష్టం వచ్చిన కీర్తనలు వారు పాడుకునేవారు.

నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యూరు లోనే గడపాలనీ తన సంపదనంతా త్యాగరాజు స్వామి సేవకే అంకితం చేసింది. అంతే కాకుండా మహిళలు కూడా ఆరాధనల్లో పాల్గొనేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసింది. 1952 లో ఆమె చనిపోయినపుడు ఆమెను త్యాగరాజు సమాధికి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఆ విగ్రహం త్యాగరాజు సమాధిని చూస్తూ ఉన్నట్లు ఉంటుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 

click me!