ఖగోళ శాస్త్రం రవిని స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం. మనకున్నవి పన్నెండు రాశులు.
సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మన ప్రత్యక్ష దైవము. అతడు అన్ని జీవరాశులకు ఆధారము, ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి. ఖగోళ శాస్త్రం రవిని స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం. మనకున్నవి పన్నెండు రాశులు. సూర్యుడు నెలకొక రాశిలో కాలం గడిపి, ఆ తరుణం గడచిన పిదప ఒక రాశిని వదలి తరువాతి రాశిలో ప్రవేశిస్తుంటాడు. సూర్యుని ప్రవేశం జరిగిన రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు. అదే సంక్రమణం. దీనినే సంక్రాంతి అంటాము. అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు. అయితే ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం. ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం. ఈ ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు. ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల ప్రారంభం.
" క్రాంతి.....సంక్రాంతి "
మకరరాశిలోకి సూర్యుని గమనం
మకర సంక్రాంతి పర్వదిన ఆగమనం
తెలుగువారి సంస్క్రతిని తెలిపే ప్రత్యేక పర్వదినం!
చెడు నుంచి మంచికి
దానవత్వం నుంచి మానవత్వం వైపుకు
అశాంతి నుంచి శాంతి వైపుకు
అవిశ్వాసం నుంచి విశ్వాసం ధరికి
అపనమ్మకం నుంచి నమ్మకం వైపుకు
స్వార్ధ భావం నుంచి నిస్వార్ధం వైపుకు
అవినీతి నుంచి నీతి నిజాయితీల వైపుకు
నాది అనే స్వరం నుంచి మనది అనే స్వరం వైపుకు
మనిషి మనసు
పరివర్తనతో పరుగిడిన నాడు
ఆరంభమౌతుంది జీవన సంక్రమణం
జరిగితీరుతుంది లోక కళ్యాణం
అరుదెంచే నవ్య సంక్రాంతిలక్ష్మిని ఆహ్వానిద్దాం
నవ్య క్రాంతి మార్గాన సజ్జనులమై పయనిద్దాం
undefined
తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో లోగిళ్లు కొత్త అల్లుల్లతో బంధుమిత్రులతో కళకళలాడతాయి. సంక్రాంతి విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకరరాశి అందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది. కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. సంక్రాంతి ముందు రోజువచ్చే పండుగ భోగి. తరువాత వచ్చేది మకర సంక్రాంతి తరువాత వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి"గా పెద్దలు వివరణ చెబుతుంటారు. "మకరం" అంటే మొసలి. అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు.
సాధారణంగా డిసెంబర్ 22 తారీఖు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు. అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాపితామహుడు ఈ పర్వదినం వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి "మాఘ శుద్ధ సప్తమి" నాడు మొదలుకుని తన పంచప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మోక్షం పొందాడు. జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు.
పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది. ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది. ఈవిధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
సంక్రాంతికి పితృదేవతలకూ సంబంధం ఉంది.. పితరుల కృప ఉంటే పితృ కృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడినది. ఇందులో అన్ని పితృగణాలూ వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు, పితృ దేవతలు. వారి అనుగ్రహం వలన, వంశవృద్దీ, ఐశ్వర్య క్షేమాలూ సమకూరుతాయి.
మకర సంక్రాంతి నిర్ణయము:- తేదీ 15 -1 -2022 శనివారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశీ శుక్రవారం రోహిణీ నక్షత్రం బ్రహ్మ యోగం బాలవకరణం నందు అనగా తేదీ 14 -1 -2022 శుక్రవారం రోజు రాత్రి 8:37 ని.లకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం కనుక
శ్లో౹౹ సూర్య స్తోత్తరం ఘటికా త్రయం సంధ్యా తత్ర మకర సంక్రమే పూర్వ దినమేవ పుణ్యం౹
సూర్యోదయాత్ ప్రాక్ ఘటికా త్రయం ప్రాత స్సంధ్యా తత్ర కర్కటక సంక్రాంతౌ పరదినం పుణ్యమితి౹౹
శ్లో౹౹ యధాస్తమయ వేళాయాం మకరం యాన్తి భాస్కరః ప్రదోశేవార్ధరాత్రేవ స్నానం దానం పరేహాని౹౹
రాత్రౌ స్నానం న కుర్వీత దానం చైవ విశేషతః ౹
ప్రత్యూషే కర్కటే భానుః ప్రదోషే మకరం యది
త్రిమ్షట్కర్కటకే నాడ్యయః మకరేతు దశాధికం౹౹ ( నిర్ణయ సింధు ధర్మ ప్రవృత్తి )
పై శ్లోకాల ఆధారంగా సూర్యాస్తమయం అనంతరం సుమారు ఆరున్నర ఘడియలు పైన ఉన్నది కాబట్టి అనగా 2 గంట 38 నిమిషాల తర్వాత మకర సంక్రమణ ప్రవేశం అయినచో పుత్ర వంతులగు గృహస్తులకు స్నాన దాన ఉపవాసములు రాత్రి నిషిద్ధమై నందున ప్రదోష అర్ధరాత్రులందు మకర సంక్రమణ ప్రవేశమైన పరదినం పుణ్యకాలం అగును అనగా 14వ తేదీ నాడు సాయంకాలం 05:59 లకు సూర్యాస్తమయం తర్వాత రాత్రి 8 గంటల 37 నిమిషములకు మకర సంక్రమణ ప్రవేశ సమయం 8:37 ప్రవేశ సమయం 5: 59 సూర్యాస్తమయం 2:38 ని.లు.
కనుక 15-1-2022 శనివారం నాడు సంక్రాంతి పండుగ జరుపుకోవాలి.
14-1-2022 శుక్రవారం భోగి.
15-1-2022శనివారం సంక్రాంతి.
16-1-2022ఆదివారం కనుమ.
17-1-2022 సోమవారం ముక్కనుమ.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151