Ekadasi: ప్రభోదిని ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి..?

By telugu news teamFirst Published Nov 15, 2021, 9:14 AM IST
Highlights

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


            శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
            విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం 
            లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
            వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం 

భారతీయ హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు. 

కార్తీక శుద్ధ ఏకాదశిని 'ప్రబోధైకాదశి' , 'బృందావన ఏకాదశి' అనే పేరుతో పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు  కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి , దేవ ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి భోధిని ఏకాదశి అని కూడా అంటారు. 

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి బ్రహ్మదేవుడు, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. 

ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది... పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు.

ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. పేదవారికి  వస్త్రదానం, పండ్లు, ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు.

అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. 
కాబట్టి విష్ణుమూర్తికి హరతి ఇవ్వాలి.. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూసినా..  హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.


 

click me!