నృసింహ జయంతి

By telugu news team  |  First Published May 6, 2020, 10:25 AM IST

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

        ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
        నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్ 

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు. 

నరసింహ జయంతి వృత్తాంతం:- హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు.

అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందర గిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవ,దానవ,మనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. 

అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇంక వర గర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచ భూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింప సాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు  "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వ భూతములందు సమ భావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కుల గురువులైన చండామార్కుల కప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడుహిరణ్య కశిపుడు మండి పడ్డాడు.

తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

శ్రీ నరసింహావిర్భావం :-  బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. 
ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో ( గోళ్లతో )చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి ( మనిషీ , జంతువూ కాక) నారసింహుని రూపంలో ( పగలు, రాత్రి కాని ) సంధ్యాకాలంలో ( ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని ) గోళ్ళతో ( ఇంటా బయటా కాక ) గుమ్మంలో ( భూమిపైనా, ఆకాశంలో కాక ) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

నృసింహస్తుతి :-

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం 
వందే కృపానిధిం అహోబలనారసింహం

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం 
వందేకృపానిధిం అహోబలనారసింహం

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం 

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం

ఈ శుభదినాన్ని మనమందరం నృసింహజయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు. ఓం నమో నృసింహ దేవాయ నమ:

click me!