ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
జ్యేష్ఠ మాసము తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల జ్యేష్ఠము. చైత్రం, వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠమాసం. ఈ మాసం మే 22 తేదీన ప్రారంభమై జూన్ 21 వరకు ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది ఛైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.
జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.
జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది.
జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు.
జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి.
సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
సంపూర్ణ సూర్యగ్రహణం :- ఈ మాసంలో అమావాస్య రోజు 21 తేదీ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం మృగశిర నక్షత్రం నాల్గవ పాదం, ఆరుద్ర మొదటి పాదంలో సింహ, కన్య, తులా లగ్నాలలో భారత కాలమానం ప్రకారం ఉదయం 10:13 స్పర్శ ప్రారంభమై మధ్యాహ్నం 2:02 నిమిషాల వరకు అనగా సుమారు మూడున్నర గంటలకు పై చిలుకు దేశ ప్రాంతాల వారిగా దర్శనం ఏర్పడనున్నది.
జ్యేష్టమాస ఫలములు :- గోచారరిత్య ఈ మాసంలో ఐదు శని,ఆదివారములు ఉన్నందున దుర్భిక్షం, ఆనారోగ్య బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దూది, సూత్రధ్యాన్యాదులు అధిక ధరలు కలిగి ఉండును. బియ్యం, శనగలు ,మినుములు, సుగంధ ద్రవ్యములు, కుంకుమ పువ్వు, కర్పూరం, తమలపాకులు, గంధం, అవిసెలు, బఠాణీలు, కందులు, పెసల్ల ధరలు తేజోవంతంగా ఉంటాయి. ఆవాలు, సజ్జలు, జీలకర్ర ఉప్పు, లక్క, వెదురు, కాగితం, సిమెంటు, ఇనుము, ఉక్కు, రత్నాలు, వస్త్రాలు, బంగారం, వెండి, వ్యాపార వాటాలు, వాహనములు, పెయింట్స్, చేతిపని వస్తువులు ధరలు అధికంగా ఉండును. పల్లిలు, పసుపు, మిరియాలు, నువ్వులు, బెల్లం, నెయ్యి, అల్లం, పూలు, పండ్లు, దుంపకూరలు, జలసంబధమైన ఉత్పత్తుల ధరలు నిలకడ లేక ఎగుడు, దిగిడుగా ఉండే అవకాశం గోచరిస్తుంది.