సంతాన వృక్షం

By telugu news teamFirst Published May 20, 2020, 11:34 AM IST
Highlights

ఆదిత్య వృక్షమని కూడా ఆ చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపమువలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందెనని పద్మపురాణం చెబుతోంది. అందుకే శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు. 
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

సనాతన ధర్మమునందుగాని ఆర్ష ధర్మమునందు గాని పురాణములయందుగాని వృక్ష జాతికి యున్న ప్రాధాన్యత తక్కువగాదు. ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాదినుండి ప్రశంశింపబడేవి వృక్షములు. రావిచెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షమని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షములు దేవతల నివాస స్థానములు అని అధర్వణ వేదములో చెప్పారు. ఆదిత్య వృక్షమని కూడా ఆ చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపమువలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందెనని పద్మపురాణం చెబుతోంది. అందుకే శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు. 

వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేనే అని భగవంతుడు చెప్పెను. మన ఉపనయనములయందు రావి కొమ్మ ప్రాధాన్యత ఎనలేనిది. సంతానం లేనివారు మండలం రోజులపాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. యజ్ఞ యాగముల యందు సమిథలుగా రావి చెక్కలను వాడుతారు. గౌతమబుద్ధుడు రావి చెట్టు క్రింద జ్ఞానం పొందుటవలన దీనిని బోధివృక్షమని చైత్యవృక్షమని కూడా పిలుస్తారు. ఇక రెండవది మర్రి చెట్టు. దీనినే వటవృక్షం అని కూడా అంటారు. మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు.

దీనిని న్యగ్రోధ వృక్షము అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు అని భావన. ప్రళయ కాల సమయము నందు యావత్ జగము జలమయము అయినపుడు శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వట పత్రముపై వట వృక్షము నందు మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చినాడు అని భాగవతం చెబుతోంది. ఈ మర్రి చెట్టు నీడన విలసిల్లిన విద్యా కేంద్రములు ఎన్నో.

ఈ రెండింటి తరువాత అంతటి ప్రాధాన్యత గలిగినటువంటిది మేడి వృక్షం. దీనిని ఉదుంబర వృక్షము అని కూడా సంబోధిస్తారు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి యొక్క చేతులకు వాడి రక్తపు మురికి పట్టి జిలలు ప్రారంభమయినవి. ఆ పట్టిన పీడ జిలలు వదిలించుకొనుటకు తన చేతి గోళ్ళను ఉదుంబర వృక్షము నందు గ్రుచ్చి కాసేపు యుంచగానే వారికి ఉపశమనం లభించెను.

అంతటి ప్రశసక్తి చెందినది మేడి చెట్టు. దత్తాత్రేయుని రెండవ అవతారంగా భావించేటువంటి సద్గురు నృసింహ సరస్వతి సదా మేడి చెట్టు క్రింద ధ్యానమగ్నులయి భక్తులను అనుగ్రహించేవారని గురు చరిత్ర చెబుతోంది. వేప చెట్టుకు ఆధ్యాత్మికతలో అనంత ప్రాధాన్యం ఉంది. అమ్మవారి మరో రూపంగా భావించుట జరుగుతుంది.

తమ దివ్య ఆయుధములను పాండవులు జమ్మి చెట్టుపై సంవత్సర కాలం ఉంచారు. మహాదేవుని మారేడు దళములతో అర్చిస్తే ఆయనకు బహు ఇష్టం. తులసి చెట్టును పూజించని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కార్తీకమాసము నందు ఉసిరిక చెట్టుకు, ఫలమునకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

చాలామంది రావిచెట్టుకు మర్రి చెట్టుకు వివాహం జరిపిస్తే అనంత ఫలము ఉంటుందని చెబుతారు. చాలామంది యోగులు వృక్షమును సంసారంతో పోలుస్తారు. మానవునిలోని అవ్యక్తం అనే భావనను సూచిస్తే చెట్టు మాను మహత్తును సూచిస్తుంది. చెట్టును విస్తరింపచేసే రెమ్మలు కొమ్మలు సుఖ దుఃఖములు.

ఇవి విస్తరించినట్లుగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఇక వృక్షమునకు ఉండే ఆకులు మానవ జీవితములు. ఎందుకంటే ఎండుటాకులు రాలి నూతన ఆకులు వచ్చినట్లు చావు పుట్టుకలు మానవులలో చాలా సహజం. గాలికి ఆకులు కదలినట్టు మానవునిలో సదా కోరికలు మెదలుతూ ఉంటాయి.

చెట్టు బెరడు మానవుని బహిరంగ ప్రదర్శన లేదా ప్రవర్తన అయితే బెరడు లోపల ఉండే కాండము అంతర్గత ప్రవర్తన. చెట్టుకు ఉండే తొర్రలు అనేవి ఇంద్రియములు లెక్క, మానవుని చర్య ప్రతిచర్యలు చెట్టుకు పట్టి ఉండే నార, చెట్టు వేళ్లు మానవుని కర్మ బంధనములు.

చెట్టుకు కాసే ఫలములు శుభం మరియు అశుభములు. చెట్టు చిన్ననాడు ఏ వైపు వంచితే అదేవైపునకు పెరుగుతుంది. అదేవిధంగా మానవ జీవితం కూడా. 

వృక్షాలలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వాటికి మహాత్కరమైన శక్తులున్నాయని మన పూర్వీకులు తెలియజేశారు. అందుకే వృక్ష ప్రదక్షిణలకు ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. సంతానం లేనివారు, గోచర గ్రహస్థితి బాగులేని వారు రావి చెట్టుకు భక్తీ శ్రద్ధలతో మండలం రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతాన సాఫల్యత కలుగుతున్నాయని పూర్వీకుల అనుభవకపూర్వక ప్రయోగానుభవసారంగా తెలియజేసారు.   
 

click me!