ఫుడ్ కలర్స్‌పై కర్ణాటకలో నిషేధం.. వినియోగిస్తే 7ఏళ్లు జైలు... అంత ప్రమాదకరమా?

By Galam Venkata Rao  |  First Published Jun 25, 2024, 10:49 AM IST

కర్ణాటక అంతటా ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్స్‌ వినియోగంపై నిషేధం విధిస్తున్న ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారంలో కృత్రిమ రంగులు వినియోగిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?


ప్రజారోగ్యానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో గోబీ మంచూరియా, పీచు మిఠాయిల విక్రయాలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం... తాజాగా మరో ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఫుడ్‌ కలరింగ్‌ ఏజెంట్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 

గతంలో కర్ణాటక వ్యాప్తంగా సేకరించిన నమూనాలను పరీక్షించిన ఆ రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం... కాలిఫ్లవర్‌తో తయారు చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయిలలో విరివిగా కృత్రిమ రంగులు వాడినట్లు గుర్తించింది. అప్పట్లోనే ఆర్టిఫీషియల్ కలర్స్ వాడకంపై నిషేధం విధించింది. అలాగే, పీచు మిఠాయి, మంచూరియా విక్రయాలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ల్యాబ్‌లో పరీక్షించిన 171 గోబీ మంచూరియా శాంపిళ్లకు గాను వందకు పైగా శాంపిళ్లలో దారుణమైన ఫుడ్‌ కలర్స్‌ వాడినట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. అలాగే, పీచు మిఠాయి అయితే 25 శాంపిళ్లలో 15 శాంపిళ్లది ఇదే పరిస్థితి. టార్ట్రాజైన్, కార్మోయిసిన్, రోడమైన్-బి లాంటి కెమికల్స్‌తో తయారైన ఆర్టిఫిషియల్‌ కలర్స్‌ను గోబీ మంచూరియా, పీచు మిఠాయిలు కలర్‌ఫుల్‌ కనిపించేందుకు వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. 

Latest Videos

undefined

ఇలాంటి కలర్‌ ఏజెంట్లు కలిపిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. అయితే, ఫుడ్‌ కలర్స్‌ లేకుండా తయారుచేసిన గోబీ మంచూరియాను విక్రయించవచ్చని అప్పట్లో స్పష్టం చేసింది. 

గతంలో ఫుడ్‌ కలర్స్‌ కలిపిన గోబీ మంచూరియా, షుగర్ క్యాండీలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం... తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్‌ కబాబ్స్‌, చేపలు, ఇతర ఆహార పదార్థాల వినియోగంలో విపరీతంగా కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించి... ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. చికెన్ కబాబ్స్, ఫిష్ డిష్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించింది. 

దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఆకస్మిక తనిఖీలు చేసింది. కర్ణాటక అంతటా విక్రయించే 39 రకాల కబాబ్‌ల నమూనాలను సేకరించి.. రాష్ట్ర ప్రయోగశాలల్లో విశ్లేషించారు. అందులో 8 కబాబ్ నమూనాల్లో కృత్రిమ రంగులు ఉన్నట్లు గుర్తించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006లోని సెక్షన్ 3(1)(zz)(viii) ప్రకారం ఇవి సురక్షితం కాదని తేల్చారు. 

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రమంతటా ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్స్‌ వినియోగంపై నిషేధం విధిస్తున్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ రావు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి.. కర్ణాటకలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారంలో కృత్రిమ రంగులు వేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే, 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.  

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?

ఆహార భద్రతపై కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. కల్తీ, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆహార భద్రత చర్చకు వస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల్లో కుళ్లిన, ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. క్వింటాళ్ల కొద్దీ మాంసాన్ని రోజుల తరబడి హోటళ్లు, దుకాణాల్లో నిల్వ చేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక, ఫుడ్‌ కలర్స్‌ వినియోగం గురించి చెప్పక్కర్లేదు. ఫుడ్‌ డిషెస్‌ ఆకర్షణీయంగా కనిపించేందుకు విచ్చలవిడిగా కలర్స్‌, ఇతర ఆర్టిఫిషియల్‌ ఏజెంట్లను వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నా.. ఫుడ్‌ సేఫ్టీ విభాగాలు మొద్దు నిద్ర వీడటం లేదు. అప్పుడప్పుడూ హడావుడి చేయడం తప్ప.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. 

ఫుడ్‌ కలర్స్‌ ఎక్కువగా వీటిలోనే...
ఉద్యోగాలు, చదువుల నిమిత్తం యువతతో పాటు అనేక కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నాయి. హడావుడి జీవన విధానం కారణంగా వంట చేసుకునే టైమ్ కూడా చాలా మందికి ఉండటం లేదు. మహా నగరాల్లో అయితే చాలా మంది హోటల్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం, లాగించేయడమే జరుగుతోంది. ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్తూ ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో తినేసి వెళ్లేవారు చాలామందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ఫుడ్‌లో ఎక్కువగా కలర్స్‌ కలిసే అవకాశం ఉందంటే... 

ఐస్‌క్రీమ్స్‌, బ్రెడ్‌, పాప్ కార్న్, పికిల్స్‌, సలాడ్స్‌, చాక్లెట్లు, కూల్‌ డ్రింక్స్‌, స్నాక్స్‌, స్వీట్లు, క్యాండీలు.. ఇలా పలు రకాల ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. కొందరైతే కృత్రిమంగా తయారు చేసిన పాలు, పెరుగులో కూడా కలర్‌ ఏజెంట్స్‌ వినియోగిస్తున్నారు. 

సమస్యలివే...
ఇలా కృత్రిమ రసాయన రంగులు కలిసిన ఆహారం తినడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఫుడ్‌ కలర్స్‌ కలిసిన ఆహారం తీసుకున్న పిల్లల ఆరోగ్యంపై అయితే తీవ్రమైన ప్రభావం ఉంటుంది. చిన్న పిల్లల్లొ హైపర్ యాక్టివిటీతో పాటూ, ఆటిజం బారినపడే ప్రమాదం ఉంది. చిరాకు, డిప్రెసన్, మానసిక ఆందోళనలు పెరగడంతో పాటు ఒంటిపై దద్దుర్లు రావడం, శరీరంలో క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశాలున్నాయి. ఇవే అలర్జీల బారిన పడటం, శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్స్‌ కారణమవుతున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 
 

click me!