Latest Videos

చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైల్ పైనే.... మున్ముందు ఎదురుకాబోతున్న సవాళ్లివే...

By Galam Venkata RaoFirst Published Jun 12, 2024, 8:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మించి సంక్షేమాన్ని అమలు చేస్తామని కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించింది. గురువారం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు పలు కీలక ఫైళ్లపై సంతకం చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. 24 మంది మంత్రులతో కలిసి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్‌ కల్యాణ్‌, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌ లాంటి సీనియర్‌ నాయకులతో పాటు 17 మంది కొత్త వారికి చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం దక్కింది. 

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అమరావతి తిరిగి వస్తారు. సాయంత్రం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాయంలో మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేస్తారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ రూ.4వేలకు పెంపు ఫైల్‌పై మూడో సంతకం చేస్తారు. అలాగే, స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడంతో పాటు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు సంతకాలు చేయనున్నారు. 

ముందున్న సవాళ్లివే...
వచ్చే నెల నుంచి పెంచిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు పింఛనుదారులకు వచ్చే నెల నుంచి రూ.వేల పింఛను అందించనున్నారు. అలాగే, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు కలిపి రూ.వెయ్యి పెంచి ఇస్తామన్నారు. దాంతో కలిపి వచ్చే నెలలో ఒక్కో పెన్షనర్‌కు రూ.7వేలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రకారం రాష్ట్రంలోని 65 లక్షల 30వేల మంది లబ్ధిదారులకు జులై 1న పంపిణీ చేయడానికి రూ.4వేల 400 కోట్లు అవుతుంది. ఆగస్టు నుంచి నెలకు రూ.2వేల 800 కోట్లు ఖర్చు కానుంది. 

ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 సంవత్సరాలకే పింఛను అందిస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజికవర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎందరు ఉన్నారనే లెక్కలు తేలుస్తున్నారు అధికారులు. వారికి అందించబోయే పింఛను రాష్ట్ర ప్రభుత్వానికి భారం కానుంది. 

అలాగే, సూపర్‌ సిక్స్‌ హామీలో భాగంగా ఇచ్చిన పథకాలకు చెల్లింపులు కొత్త ప్రభుత్వానికి సవాలే అని చెప్పవచ్చు. యువతకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు నిరుద్యోగ యువతకు భృతిగా ప్రతి నెలా రూ.3వేలు చెల్లించాల్సి ఉంది. స్కూలుకెళ్లే విద్యార్థికి రూ.15వేల చొప్పున, ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి ప్రతి నెలకు రూ.1500 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి భారమే. ఇక, గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి చెల్లించాల్సిన రుణాలు అదనపు భారం. 

click me!