సిఎంగా రికార్డు కోసమే సచివాలయంకు వాస్తు మార్పులు

Published : Oct 20, 2016, 09:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సిఎంగా రికార్డు కోసమే సచివాలయంకు వాస్తు మార్పులు

సారాంశం

సుదీర్ఘ కాలం సిఎంగాా ఉండాలన్నదే కెసిఆర్ లక్ష్యం అందుకోసమే సచివాలయంకు మార్పు, చేర్పులు మాజీ ముఖ్యమంత్రుల పదవీకాలాన్ని అధ్యయనం చేసిన కెసిఆర్ త్వరలో మొత్తం సచివాలయాన్ని కూలగొట్టాలని నిర్ణయం ఏపి సచివాలయం స్వదీనం కోసం చంద్రబాబుతో త్వరలో మంతనాలు  

సుదీర్ఘ కాలం నిశ్చింతగా ముఖ్యమంత్రిగా పాలన చేసే ఉద్దేశ్యంతోనే కె. చంద్రశేఖర్ రావు సచివాలయం మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సచివాలయంను కూలగొట్టి పక్కాగా వాస్తు ప్రకారం కొత్తగా నిర్మించాలన్న కెసిఆర్ యోచన వెనుక పెద్ద కసరత్తే నడిచింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర విభజన జరిగేటప్పటికి సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి వరకూ నేపధ్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సమాచారం.

సిఎంలుగా పనిచేసిన వారి జాబితాను, వారి పదవీ కాలాన్ని పరిశీలించిన తర్వాతే వాస్తు దోషం వల్లే వాళ్లెవరూ పూర్తి కాలం పదవిలో కొనసాగ లేకపోయారని,  కొనసాగిన ప్రశాంతంగా ఉండలేకపోయారనే నిర్ణయానికి వచ్చారు.

దీనికి విరుగుడు ప్రస్తుత సచివాలయంకు వాస్తు మార్పులు చేయడమే నని కెసిఆర్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  సిఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సచివాలయం వాస్తు విషయమై కెసిఆర్ కొందరు వాస్తు పండితులను సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుత సచివాలయం నిర్మాణంలో వాస్తు దోషాలు ఉన్నాయని సదరు పండితులు చెప్పారు. దాంతో దోషాలను సరిచేస్తే సరిపోతుందని కెసిఆర్ మొదట అనుకున్నా  ప్రస్తుత నిర్మాణాల్లో దోషాలను సవరించటం అంత సులభంకాదన్న విషయం బోధపడింది. దాంతో మొత్తం సచివాలయాన్నే కూలగొట్టి కొత్తగా నిర్మించాలని పండితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. దాంతో సచివాలయంను కూలగొట్టాలన్న నిర్ణయానికి కెసిఆర్ వచ్చారు.

 అయితే అప్పటికే విభజన వల్ల ప్రస్తుత సచివాలయంను రెండుగా విభజించేసారు. దాతో మరో పదేళ్ళ పాటు మొత్తం సచివాలయం  ప్రాంగణంలోని ఎనిమిది భవనాల్లో కేవలం నాలుగు మాత్రమే తెలంగాణా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మిగిలిన నాలుగు బ్లాకులు ఏపి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. అది కూడా ఏకంగా పదేళ్ళపాటు ఉంటుంది. దాంతో ఏపి ఆధీనంలోని బ్లాకులను కూడా తీసేసుకుని మొత్తం కూలగొట్టే విషయమై కెసిఆర్ ఆలోచిస్తున్నారు.

 ఇంతలో కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగానే రాజకీయ పరిణామాలు కూడా అనుకూలించాయి. ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన  చంద్రబాబు ఏడాది కాలం కూడా తిరక్కుండానే హైదరాబాద్ ను వీడి విజయవాడ వెళ్ళిపోయారు. అలాగే,  తాను మాత్రమే వెళ్ళటం కాకుండా ఏకంగా సచివాలయం, హైదరాబాద్ లో పనిచేసే ఉన్నతాధికారులు, సిబ్బంది మొత్తాన్ని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, వెలగపూడి తదితర ప్రాంతాలకు రప్పించుకున్నారు. దాంతో ఇపుడు ఏపి ఆధీనంలోని సచివాలయం బ్లాకులు కూడా దాదాపు ఖాళీ అయిపోయాయి.

    సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి జాబితాను పరిశీలించన పుడు కెసిఆర్ ఎన్నో ఆశక్తికరమైన అంశాలు గమనించినట్లు సమాచారం.  1956లో రాష్ట్ర ప్రధమ  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీలం సంజీవరెడ్డి మొదలుకుని మొన్నటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అందరూ సిఎంగా ఇబ్బందులు పడ్డ  విషయం కెసిఆర్ గమనించారు.

మొత్తం 22 మంది ముఖ్యమంత్రులు రాష్టాన్ని ఏలినప్పటికీ కేవలం వైఎస్ రాజశేఖరెడ్డి మాత్రమే పూర్తిస్దాయి పదవీకాలన్ని అనుభవించారు.మిగిలిన వారందరూ అర్దంతరంగా దిగిపోవటమో, లేక ముందస్తు ఎన్నికలు జరిగినపుడు ఓటమిపాలవటమో జరిగింది.

   రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించిన ఎన్ టి ఆర్ కూడా రెండు సార్లు సిఎం పదవిని కోల్పోయారు. ఇక హమాహేమీలని అనిపించుకున్న నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి లాంటి వారు కూడా సిఎం స్ధానం నుండి అర్ధంతరంగా దిగిపోయినవారే. మిగిలిన వారిలో అత్యధికులు చాలా కొద్ది కాలం మాత్రమే ముఖ్యమంత్రులుగా చేసారు.

  ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తిగా ఐదేళ్ళూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రెండోసారి గెలవగానే ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా సమైక్య రాష్ట్రంలో దాదాపు 9 ఏళ్ళ పాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి బోల్తా పడ్డారు. అదీకాకుండా చంద్రబాబుపై మావోయిస్టులు హత్యాయత్నం చేసిన ఘటన దేశంలోనే ఒక సంచలనం.

ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ లకు ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నంత కాలం కంటి మీద కునుకే కరువైందని అందరికీ తెలిసిందే. ఇటు వంటి విషయాలను గమనించిన తర్వాతే తెలంగాణా చరిత్రలో మొదటి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాలించిన ఘనత తనకు దక్కాలటే సచివాలయాన్ని వాస్తు ప్రకారం మార్పులు చేయక తప్పదని కెసిఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లే చర్యలు కూడా తీసుకుంటున్నారు.

   

PREV
click me!