బడుల్లో ఇంగ్లీష్ మీడియంపై జగన్ మొండిపట్టు: ఎందుకంటే?

By telugu teamFirst Published Nov 14, 2019, 2:54 PM IST
Highlights

ఎంతగా వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ మొండిపట్టుదలతోనే ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో జగన్ ఎందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారో చూద్దాం.

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో చదువుల విప్లవం మొదలైందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్దలు భావిస్తున్నారు.  పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్నారు డాక్టర్‌ వైయస్సార్‌. ఆ దిశలో ముఖ్యమంత్రిగా... మరొకరికి ఆలోచనకు కూడా అందని రీతిలో కృషి చేశారు. పేదింటి పిల్లల చదువులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది తండ్రి బాటే. తండ్రి ఒక అడుగు వేస్తే...తాను రెండడుగులు ముందుకు వేయాలన్న తాపత్రయమే.పేదలకు పెద్ద చదువులు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒక రకంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రవాహానికి ఎదురీదుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు- నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారంనాడు ప్రారంభించారు చదువుల వెలుగులు పంచితే కుటుంబాలు వెలుగుతాయి. తరాలు మారుతాయి. సామాజిక గతివేగం పాజిటివ్‌ దిశలో సాగుతుంది. అభివృద్ది ఫలాలు అందుకోవడంలో సమాజంలోని అందరూ సమానభాగస్వాములు అవుతారు.  

Also Read: బడుల్లో ఇంగ్లీష్ మీడియం: చిన్న లాజిక్ ను మిస్సవుతున్నారా?

అందరూ చదవాలి..అందరూ ఎదగాలి..

సీఎంగా  వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై ప్రత్యేకశ్రద్ద చూపుతున్నారు. చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రాధమిక విద్యనుంచే గట్టి పునాదులు పడేలా తపించిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కల్పించడమే ధ్యేయమని ఆయన చెబుకుంటున్నారు. పేదింటి పిల్లలకు అందించే పెద్ద ఆస్తి మంచివిద్యేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో ఆయన ఆలోచనలు, ప్రణాళికలు చేసి అమలు చేయడానికి పూనుకున్నారు. 

ప్రభుత్వ బళ్లల్లో ఇంగ్లీషు మీడియంలో చదువులు అని సీఎం అనగానే అటు ప్రశంసలు, ఇటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాస్తా సంయమనంతో ఆలోచిస్తే, అందులోని మంచిచెడులు విశ్లేషిస్తే...మంచే మరింత మెరుగ్గా...ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్లీషంటే బెరుకు పోగొట్టడానికి, నడుస్తున్న ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ఆ భాష ఒక ఆయుధమన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. 

Also Read: ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

మరిన్ని మంచి సలహాలతో...విద్యాపరంగా రాష్ట్రం ముందంజ వేయడానికి అందరూ సహకరించాలి. చదువుల విషయంలోనూ విమర్శల పేరిట రాజకీయ ప్రయోజనాలకు వెంపర్లాడడంగానే కనిపిస్తోంది.  వట్టిగా విమర్శలు చేస్తూ కూర్చుంటామంటే...’నేను అన్నం పెడతానంటే...మేము సున్నం పెడతామన్నట్టు’గా ఉంటుంది.  

విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని, విద్యార్థి ప్రతిభను సానపెట్టాలని, వారిలో నైపుణ్యాలను పెంచాలని...ప్రపంచంలో మేము సైతం అని సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేయాలన్న ఉన్నతాశయం సీఎం జగన్‌ది. అందుకు సర్కారు బళ్లను తీర్చిదిద్దడం, ప్రైవేటు ఫీజుల బెడద లేకుండా చేయడం, అమ్మ ఒడి పథకం ద్వారా పేదింటి బిడ్డలకు ఆర్థిక సాయం అందించడం ఆ ఆశయంలో భాగాలే.

నడుస్తున్న రాజకీయ చరిత్రలో చదువుల గురించి పట్టించుకోవడమే సరిపడని విషయం. అలాంటిది పేదపిల్లల చదువుల గురించి, సర్కారు బళ్ల గురించి ఆలోచించడమన్నది నేటి పొలిటీషియన్‌లలో చాలామందికి అర్థం కాని విషయం. తమ పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్లలో చదివితే చాలు, పేదపిల్లలు ఏమైతే మాకేంటి? అన్న సంకుచిత ధోరణులతో ఆలోచించే వారికెవరికైనా జగన్ మనసును అంత సులువుగా అర్థమవుతుందనుకోవడం భ్రమే.

Also Read: తెలుగు భాషపై పవన్ కల్యాణ్ మాట: అసలు విషయం ఇదీ.

తమ పిల్లలు బాగా చదవాలని, తమ కుటుంబాల తలరాతలు మారాలని అనుక్షణం పరితపించే పేద తల్లిదండ్రుల గురించి... ఆ ఇంటి మనిషిగా ఆలోచించడమన్నది ఆషామాషీ పొలిటీషియన్లకు అసలు సాధ్యం కాని విషయం. 

నవ శకానికి నాంది

ఒక మంచి సంకల్పంతో ...అందరికీ మంచి చేయాలని... పాలనలో ముందడుగులేస్తూ  ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌ ఆశయాల బాట సామాన్యప్రజలకు వెలుగుబాట. పసిపిల్లల... బడిపిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు దిశలో ప్రభుత్వ ఆలోచనలు సాగుతుండటం ఆందరూ ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పాలి. నవంబర్‌ 14, బాలల దినోత్సవం రోజున... ’నాడు–నేడు’ పేరుతో తొలి అడుగులు పడడడం విద్యాలోకంలో కొత్తశకానికి నాంది.

click me!