గులాబీ గూటికి చేరేందుకు ఉత్తమ్ దంపతులు సిద్దం?.. ఆ ఒక్క విషయంపై క్లారిటీ కోసం..

By Asianet NewsFirst Published Jul 25, 2023, 11:39 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నిలక సందడి మొదలైంది. ఇలాంటి వేళ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికు సంబంధించిన  ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు గానీ, ఆయన సతీమణి పద్మావతి పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నిలక సందడి మొదలైంది. ఈ ఏడాది  చివరిలో రాష్ట్రంలో ఎన్నికలు జగరనున్న వేళ కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం ముందుగానే ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు టికెట్ ఆశావాహులు కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి వేళ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికు సంబంధించిన  ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు గానీ, ఆయన సతీమణి పద్మావతి పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం.  ప్రస్తుతం ఇందుకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని వెనక బలమైన కారణమే ఉందనే టాక్ వినిపిస్తుంది. 

అయితే గత కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం సాగుతుంది. ఆయన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో టచ్‌లో కూడా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పార్టీలో కొందరు కావాలనే తనపై, తన సతీమణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే తన ఫిర్యాదులో చిన్న చిన్న వ్యక్తులే బయటకు వచ్చారని.. దీని వెనక పార్టీలోని ముఖ్యుల హస్తం ఉందని కూడా ఆరోపణలు చేశారు. 

Also Read: పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి.. పీపీఏకు తెలంగాణ సర్కార్ లేఖ..

అయితే తాజాగా ఉత్తమ్ కుమారెడ్డి ప్రధాన అనుచరుడు, అత్యంత సన్నిహితుడు యాదాద్రి భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గులాబీ గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణంగానే తాను రాజీనామా  చేస్తున్నానని అనిల్ కుమార్‌రెడ్డి చెప్పడం ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ ప్రధాన అనుచరుడు పార్టీని వీడటం, కాంగ్రెస్‌ ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ దంపతుల పేర్లు లేకపోడంతో.. వారు కూడా బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. 

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైపోయిందని.. ఇందుకు సంబంధించి తెరవెనక మంతనాలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది. ఉత్తమ్ దంపతులు.. రెండు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతుండగా.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఒక ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇస్తామనే ప్రతిపాదించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతికి కోదాడ ఎమ్మెల్యే టికెట్, ఆయన ఏదో ఒకచోటు నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలోనే చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఉత్తమ్ దంపతులు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ విషయంపై ఉప్పందడంతోనే కాంగ్రెస్ పార్టీ కూడా వారి విషయంలో వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. మరోవైపు ఉత్తమ్  కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి పద్మావతి మాత్రం హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

click me!