ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. యూపీ ఎన్నికల్లో బిజెపి సాధించే ఫలితాన్ని బట్టి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఫలితాలను బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు వైఖరి కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసీఆర్ పూర్తిగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆయన పదే పదే విరుచుకుపడుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు నుంచి ఐఎఎస్ అధికారుల సర్వీస్ రూల్స్ మార్పు వరకు అన్ని విషయాల్లోనూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల పోరును బిజెపికి, టీఆర్ఎస్ కు మధ్య చిత్రించే వ్యూహాలను రచించి, వాటిని అమలు చేస్తున్నారు. తద్వారా కాంగ్రెసు పార్టీని మూడో స్థానంలోకి నెట్టేయాలని, లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపి, కాంగ్రెసు మధ్య చీలే విధంగా చేయాలని ఆయన యోచిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును రెండు పార్టీలు చీల్చుకుంటాయనేది KCR ఆలోచనగా అర్థమవుతోంది. దానికి తగినట్లుగానే తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బిజెపి మధ్య తీవ్రమైన పోరాటం రూపుదిద్దుకుంటోంది.
undefined
అయితే, UP Assembly Election 2022 ఫలితాల ప్రభావం తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తిరుగులేని ఆధిక్యత సంపాదించి తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణలో పరిస్థితులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. యుపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణ అవుతుంది. తెలంగాణలో మరింత బలం పుంజుకోవడానికి తగిన ప్రణాళికను రచించి బిజెపి అమలు చేయనుంది. కేసీఆర్ ను ఢీకొట్టడానికి పునాది స్థాయిని పటిష్టపరుచుకునే అవకాశం ఉంది. కేంద్రంలోని అధికారం తెలంగాణలో విస్తరించడానికి అవకాశం ఉంటుందని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి తగిన ఫలితాలు సాధించలేకపోతే కేసీఆర్ కు ఊరట లభిస్తుందని విశ్లేషకుల అంచనా. యుపీలో అధికారంలోకి రాకపోయినా, మెజారిటీ తగ్గినా తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం పెద్దగా దృష్టి సారించే అవకాశం లేదు. లోకసభ ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించడానికి వీలుగా బిజెపి కేంద్ర నాయకత్వం తిరిగి యూపీపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.
అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బలం పెంచుకుంటే కేసీఆర్ బిజెపి వ్యతిరేక వైఖరిని మరింతగా ప్రదర్శించే అవకాశం ఉంది. యూపీలో బిజెపి తగిన ఫలితాలు సాధిస్తే కేంద్ర ప్రభుత్వం పట్ల తిరిగి తన మెతకవైఖరిని ఆయన ప్రదర్శిస్తారా అనేది చూడాల్సి ఉంది. కేసీఆర్ ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. పరిస్థితులను బట్టి ఆయన వైఖరి మారుతూ ఉంటుంది.