తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణమ రాజు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో రఘురామ కృష్ణమ రాజు చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణమ రాజు పార్టీ మారుతురానే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరవచ్చునని ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. బుధవారం ఏపీ సీఐడి అధికారులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాదులోని రఘురామ కృష్ణమ రాజు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటల వల్ల ఆయన జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Raghurama Krishnam raju పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ డైలాగ్ కొట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడిని అని ఆయన అన్నారు. దాంతోనే సరిపెట్టకుండా తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పుకున్నారు. ఈ కారణంగా Jana senaలో ఆయన చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం BJPతో జనసేన పొత్తులో ఉంది. ఈ కారణంగా ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
undefined
రఘురామకృష్ణమ రాజు వైసీపీ తరఫున నర్సాపురం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన వైసీపీకి ఎదురు తిరిగారు. వైసీపీ నాయకుల మీదనే కాకుండా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత YS Jagan మీద కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణమ రాజు కోర్టుకు కూడా ఎక్కారు.
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఏపీ సిఐడి అధికారులు నిరుడు మే 14వ తేదీన రఘురామ కృష్ణమ రాజును అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద రఘురామపై కేసులు నమోదు చేశారు. అందులో నాన్ బెయిలబుల్ కేసు కూడా ఉంది. బెయిల్ కోసం వివిధ కోర్టులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రఘురామ కృష్ణమ రాజుకు మే 21వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులు పెడుతూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరు కావడం లేదంటూ 17వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ AP CID అధికారులు బుధవారంనాడు నోటీసులు ఇచ్చారు.
ప్రభుత్వంతోనూ, ముఖ్యమంత్రితోనూ, వైసీపితోనూ విభేదిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తుున్న రఘురామకృష్ణమ రాజు ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. తన నియోజకవర్గానికి కూడా వెళ్లడం లేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆయన హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల తన నివాసానికి వచ్చారు. దీంతో ఏపీ సీఐడి అధికారులు హైదరాబాదు వచ్చి నోటీసులు ఇచ్చారు.
తాను లోకసభ సీటుకు రాజీనామా చేస్తానని కూడా రఘురామ కృష్ణమ రాజు ఇటీవల చెప్పారు. జనసేనలో చేరడానికి ముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తారనే మాట వినిపిస్తోంది. రాజీనామా చేసి, తిరిగి అదే నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. పొత్తు కారణంగా బిజెపి కూడా రఘురామకృష్ణమ రాజును బలపరిచే అవకాశం ఉంది.